కల్వకుంట్ల కవితకు డీఎఎస్ చిక్కులు: ముచ్చటగా మూడు గ్రూపులు

First Published Jul 6, 2018, 7:54 AM IST
Highlights

డిఎస్ పై చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ నేతలు చేసిన విజ్ఞప్తిపై కేసిఆర్ ఎటూ తేల్చడం లేదు. నిజామాబాద్ జిల్లాలో గ్రూపు తగాదాలు ముదిరి కల్వకుంట్ల కవితకు సవాల్ విసురుతున్నాయి. పార్టీలో అంతర్గత తగాదాలు పతాక స్థాయికి చేరి ఆమెకు తలనొప్పిని తెచ్చిపడుతున్నాయి.

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో గ్రూపు తగాదాలు పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవితకు సవాల్ గా మారాయి. పార్టీ అంతర్గత తగాదాల వల్లనే కాకుండా ఇతర పార్టీల నుంచి కూడా ఆమెకు సవాళ్లు ఎదురవుతున్నాయి. 

టీఆర్ఎస్ లోని గ్రూపు తగాదాలను పరిష్కరించడం ఆమెకు తలనొప్పిగా మారింది. కల్వకుంట్ల కవిత మెతక వైఖరి కారణంగా సమస్యలు పెరిగినట్లు భావిస్తున్నారు. పార్టీ నాయకులతో ఆమె చాలా సున్నితంగా వ్యవహరిస్తుంటారనే అభిప్రాయం ఉంది. ఎవరినీ నొప్పించకుండా సమస్యలను పరిష్కరించడం ఆమె వ్యవహార శైలి. అదే ఇంత దాకా తెచ్చిందని అంటున్నారు. 

డి. శ్రీనివాస్ పై చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ స్థానంలోని కార్యకర్తల నుంచి ఆమెపై ఒత్తిడి పెరుగుతోంది. డిఎస్ సమస్యను పరిష్కరించడం ఆమెకు పెద్ద సమస్యగానే మారింది. ఎమ్మెల్సీ భూపతి రెడ్డిపై కూడా పార్టీ కార్యకర్తల్లో వ్యతిరేకత ఉంది. ఈ ఇద్దరి వ్యవహారం తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పరిధిలో ఉంది. 

ఆర్మూర్ లో మున్సిపల్ చైర్ పర్సన్ స్వాతి సింగ్ బబ్లూ భర్తపై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ కార్యకర్తలు కోరుతున్నారు. అతను బంగారం చోరీ కేసులో నిందితుడిగా ఉన్నాడు. టీఆర్ఎస్ కు చెందిన బోధన్ మున్సిపల్ చైర్మన్ ఎ. ఎల్లయ్యపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలని పార్టీ కౌన్సెలర్లు కూడా డిమాండ్ చేస్తున్నారు. దానికి తోడు ధర్పల్లి ఎంపీపి అధ్యక్షుడు ఇమ్మడి గోపీ ఓ మహిళను తన్ని న సంఘటన పార్టీ ప్రతిష్టను దెబ్బ తీసిందని భావిస్తున్నారు. 

click me!