అదిలాబాద్ విషాదం.. ఇద్దరు చిన్నారులతో సహా తల్లి ఆత్మహత్య..

By SumaBala BukkaFirst Published Dec 30, 2022, 8:32 AM IST
Highlights

కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో సహా నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన అదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. 

అదిలాబాద్ : పెళ్లయిన తర్వాత సంసారంతో చిన్న చిన్న గొడవలు మనస్పర్థలు మామూలుగా వచ్చేవే. వాటిని సర్దుకుపోవడానికి భార్యాభర్తలిద్దరూ ప్రయత్నించాలి. సంయమనంతో వ్యవహరిస్తే చాలా సమస్యలు పరిష్కారమవుతాయి. అయితే చిన్న చిన్న సమస్యలకు ఇటీవలి కాలంలో పిల్లలతోపాటు తల్లులు ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. అలాంటి ఓ దారుణమైన ఘటన ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో విషాదం నింపింది. కుటుంబ కలహాల నేపథ్యంలో పెళ్లయిన ఏడేళ్ల తర్వాత ఓ ఇల్లాలు దారుణమైన నిర్ణయం తీసుకుంది. క్షణికావేశంలో తాను చనిపోవడమే కాకుండా అభం శుభం తెలియని చిన్నారులను కూడా చంపేసింది. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో గురువారంనాడు ఈ దారుణమైన విషాద ఘటన చోటు చేసుకుంది.

ఈ ఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే…అదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం పిప్పిరి గ్రామానికి చెందిన వేదశ్రీ (23)కి ఏడేళ్ల క్రితం 2015లో ఇచ్చోడ మండల కేంద్రానికి చెందిన ప్రశాంత్ అనే వ్యక్తితో పెళ్లయింది. వీరికి ఐదేళ్ల ప్రజ్ఞ, మూడేళ్ల వెన్నెల అనే ఇద్దరు ముద్దులొలికే కూతుర్లు ఉన్నారు. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో ప్రశాంత్ ఉద్యోగం చేస్తున్నాడు. అత్తింటివారితో గొడవల కారణంగా ఇచ్చోడలోనే ఓ ఇల్లు అద్దెకు తీసుకొని వేరు కాపురం ఉంటున్నారు.

నయీం ప్రధాన అనుచరుడు శేషన్నపై పీడీయాక్ట్...

కొంతకాలంగా అత్తింటివారితో వేదశ్రీకి మనస్పర్థలు, చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. వీటితో ఆమె మనస్తాపానికి గురయ్యింది. గురువారం నాడు రోజూలాగే భర్త ప్రశాంత్ ఉద్యోగానికి వెళ్ళాడు. పొద్దున్నంతా ఇంట్లోనే పనులు చేసుకుంటూ ఉన్న వేదశ్రీ సాయంత్రం 6 గంటల సమయంలో తన ఇద్దరు కూతుళ్లను తీసుకుని..  వంటింట్లోకి వెళ్ళింది. అక్కడ తన మీద, పిల్లల మీద పెట్రోలు చల్లుకుంది. ఆ తర్వాత నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. మంటల కారణంగా ఇంట్లో నుంచి పొగలు రావడంతో చుట్టుపక్కలవారు గమనించారు. వెంటనే వేదశ్రీ కుటుంబ సభ్యులకు ఈ మేరకు సమాచారం అందించారు. 

హుటాహుటిన అక్కడికి చేరుకున్న కుటుంబీకులు లోపల నుంచి గడియ పెట్టి ఉన్న తలుపులు పగులగొట్టారు. అప్పటికే తల్లీబిడ్డలు పూర్తిగా మంటల్లో ఉన్నారు. కుటుంబీకులు తల్లీబిడ్డలకు అంటుకున్న మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. మంటలు ఆర్పేశారు. అయితే,  అప్పటికే వేదశ్రీ  చనిపోయింది. చిన్నారుల ఇద్దరూ తీవ్రగాయాలతో కొన ఊపిరితో ఉన్నారు. వారిద్దరినీ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆ చిన్నారులు ఇద్దరికీ అత్యవసర చికిత్స అందించారు.  చికిత్స తీసుకుంటూ మొదట ప్రజ్ఞ, ఆ తర్వాత రెండు గంటలకు వెన్నెల చనిపోయారు. అత్తింటి వారితో మనస్పర్థల కారణంగానే వేదశ్రీ, ప్రశాంత్ వేరు కాపురం పెట్టినట్లు బంధువుల సమాచారం. 

click me!