
నల్గొండ : నల్గొండ జిల్లా నార్కట్ పల్లిలో అమానవీయ ఘటన వెలుగు చూసింది. రెండేళ్ల చిన్నారిపై కన్నతల్లి కర్కశంగా ప్రవర్తించి అంత్యంత దారుణంగా హతమార్చింది. చెంపలు పగలగొట్టి, గోడకేసి విసిరికొట్టింది. అప్పటికీ చనిపోకపోవడంతో ముక్కు, నోరు మూసి చిన్నారికి నరకం చూపించి.. ఊపిరాడకుండా చేసి చంపేశారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని ఆ చిన్నారిని నవమాసాలు మోసి కన్న తల్లే.. తన ప్రియుడితో కలిసి కర్కశంగా ప్రాణాలు తీసింది. ఆ తర్వాత మూర్చతో చనిపోయిందంటూ కథలు అల్లింది.
ఎట్టకేలకు హత్య విషయం బయటపడడంతో కన్నతల్లిని, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు దీనికి సంబంధించి నల్గొండ డిఎస్పీ నరసింహారెడ్డి సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. కనగల్ మండలం లచ్చగూడెంకి చెందిన రమ్యకు.. చిట్యాల మండలం ఎలికట్టె గ్రామానికి చెందిన ఉయ్యాల వెంకన్నతో 2015లో పెళ్లయింది. వీరికి ఒక కూతురు ఒక కొడుకు ఉన్నారు. కొడుకు శివరాం అయిదేళ్ల వాడు. కూతురు ప్రియాన్షిక రెండేళ్లది.
అయితే 2022 లో కరోనా కారణంగా వెంకన్న చనిపోయాడు. ఆ తర్వాత కొంతకాలం రమ్య అత్తమామలతో అదే ఊర్లో ఉంది. ఆ తర్వాత కొంతకాలానికి ఆ ఊరికి చెందిన పెరిక వెంకన్న అలియాస్ వెంకటేశ్వర్లుతో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధంగా మారింది. దీంతో అత్తమామల ఇంటి నుంచి వెళ్లిపోయి.. వేరే ఓ ఇల్లు అద్దెకు తీసుకుని విడిగా పిల్లలతో ఉంటోంది. అక్కడే వెంకన్నతో సహజీవనం చేస్తోంది.
అయితే అభం శుభం తెలియని రెండేళ్ల చిన్నారి తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉంటుందని వెంకన్న, రమ్యలు భావించారు. ఎలాగైనా చిన్నారిని అడ్డు తొలగించుకోవాలని అనుకున్నారు. దీని కోసం పథకం ప్రకారం పిల్లలకు ఏదైనా జరిగితే అత్తామామల కారణమంటూ గ్రామంలో ప్రచారం చేశారు. దీనికోసం వీడియోలు తీసి వివిధ గ్రూపులో పోస్ట్ చేశారు. ఆ తర్వాత డిసెంబర్ 14 రాత్రి కన్నతల్లి రమ్య, ఆమె ప్రియుడు వెంకన్న విపరీతంగా హింసించడంతో చిన్నారి ప్రియాన్షిక మృతి చెందింది.
చిన్నారి చనిపోయిన తర్వాత మూర్ఛపోయింది అంటూ నల్గొండ గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే చనిపోయిందని నిర్ధారించారు. ఆ తర్వాత పాప మృతదేహాన్ని ఇంటికి తీసుకు వెళ్ళకుండా మార్చురిలో ఉంచేసి వెళ్ళిపోయారు. మృతదేహాన్ని చూడడానికి వచ్చిన రమ్య మామ యాదగిరి.. చిన్నారి మొహంపై దెబ్బలు ఉండడంతో కోడలి మీద పోలీస్ కు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారే చంపినట్టుగా తేలింది. వెంటనే నిందితులను రిమాండ్కు తరలించారు.