
పహాడీ షరీఫ్ : చెట్టుకు కాయ భారం కాదంటారు. కానీ ఓ కన్నతల్లికి కడుపులోని బిడ్డ భారం అయ్యింది. పుడితే బాగోగులు చూసుకోలేనని భావించింది. కట్టుకున్న వాడు వదిలేయడంతో కన్నబిడ్డ భారం అనిపించాడు. అంతే పొత్తిళ్లలోనే బిడ్డను అనాథను చేసింది. చిన్నారులను అపహరించి విక్రయించే ముఠాకు గుట్టు చప్పుడు కాకుండా అమ్మేసింది. దీనికి ఆమె తల్లి కూడా సహకరించింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్ లోని పహాడీ షరీఫ్ లో జరిగింది.
Pahadi Sharifలో new born babyను రూ.2.5 లక్షలకు విక్రయించిన ముఠాను శుక్రవారం బాలాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ భాస్కర్ కథనం ప్రకారం... షాహిన్ నగర్ లో ఉండే మహిళను (24) భర్త వదిలేశాడు. 8 నెలల గర్భవతిగా ఉన్న ఆమె తన తల్లితో కలిసి టప్పాచబుత్ర జిర్రాకు వెళ్లి స్థిరపడింది. జనవరి 22న ఆమె baby boyకు జన్మనిచ్చింది. భర్త వదిలేయడంతో బిడ్డ పోషణ భారం అవుతుందని భావించింది. షాహీన్ నగర్ లోనే ఉండే చిన్నారులను అపహరించి విక్రయించే ముఠా నాయకుడైన ఆటో డ్రైవర్ మొహమ్మద్ ఖాన్ (38)కి ఈ విషయం తెలిసింది.
వెంటనే తన ముఠాలోని జీడిమెట్ల కుత్బుల్లాపూర్ లో ఉండే కే తస్లీం బేగం(34), నదియా బేగం, జల్ పల్లి కొత్తపేటకు చెందిన మహమ్మద్ హాజీ (38), కుత్బుల్లాపూర్ మండలం తిరుమలగిరిలో ఉంటున్న మొహ్మద్ యాస్మిన్ బేగం (31), సల్మాబేగం (27)లను తీసుకుని బాలింత వద్దకు వెళ్లారు. ఆమె, ఆమె తల్లి అంగీకారంతో జీడిమెట్లలోని ఓ కుటుంబానికి ఆ చిన్నారిని జన్మించిన రోజే రెండున్నర లక్షలకు విక్రయించారు. ఆ తరువాత డబ్బులు పంచుకుని ఎవరి దారిన వారు వెళ్లిపోయారు.
బిడ్డను అపహరించారని నాటకం..
ఆ తరువాతే అసలు సమస్య మొదలయ్యింది. ఆమె బంధువులందరికీ గర్భవతి అని తెలుసు.. ఇప్పుడు పుట్టిన బిడ్డ ఏదని అడిగితే ఎలా.. అనే సమస్య వచ్చిపడింది. అంతే మరో నాటకానికి తెరలేపింది. బంధు మిత్రులు బిడ్డ ఏది అని అడుగుతారేమోనన్న భయంతో తల్లి అపహరణ నాటకం ఆడింది. తన బిడ్డకు పేరు పెట్టించేందుకు మౌల్వీ దగ్గరికి వెళుతుండగా ఆగంతకులు బిడ్డను అపహరించారని జనవరి 22 అర్ధరాత్రి టప్పాచబుత్ర ఠాణాలో ఫిర్యాదు చేసింది. అక్కడి పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం గురువారం నేర సమీక్షలో భాగంగా అక్కడి పోలీసులు ఆ కేసులో నిందితులు బాలాపూర్ పరిధిలో ఉంటారని ఉన్నతాధికారులకు తెలిపారు దీంతో వారు బాలాపూర్ ఠాణాకు ఈ కేసును శుక్రవారం తెల్లవారుజామున అప్పగించారు.
దీనిపై అప్పటికప్పుడే బాలాపూర్ ఇన్స్పెక్టర్ ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. ఫిర్యాదు చేసిన తల్లి, అమ్మమ్మలే నిందితులని తేల్చారు. వారితోపాటు జీడిమెట్ కు చెందిన నిందితురాలు నదియా బేగం పరారయ్యారు. బాలుడిని స్వాధీనం చేసుకుని ముఠా నిర్వాహకుడు మహమ్మద్ ఖాన్ తో పాటు మరో నలుగురిని శుక్రవారం రాత్రి అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. బాలుడిని శిశువిహార్ కు తరలించినట్లు తెలిపారు.