జూన్ 1నే దేశంలోకి రుతుపవనాలు... తెలంగాణ వాతావరణ పరిస్థితి ఇదీ

By Arun Kumar PFirst Published May 30, 2020, 6:33 PM IST
Highlights

సుమారుగా జూన్ 1 వ తేదీన కేరళలోకి నైఋతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 

హైదరాబాద్: రాగల 24 గంటలలో దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కోమోరిన్ ప్రాంతం, నైఋతి మరియు ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని  ప్రాంతాలకు నైఋతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రము సంచాలకులు వెల్లడించారు. దీంతో రాగల 48 గంటలలో ఆగ్నేయ అరేబియా సముద్రం మరియు దానిని ఆనుకొని ఉన్న తూర్పు మధ్య అరేబియా సముద్రం ప్రాంతాలలో అల్పపీడనం  ఏర్పడే అవకాశం ఉందన్నారు. 

తదుపరి 48  గంటలలో ఇది ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణించి తూర్పు మధ్య అరేబియా సముద్రం మరియు  దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ అరేబియా సముద్రం ప్రాంతాలలో వాయుగుండముగా మారే అవకాశం ఉందన్నారు. దీని వలన సుమారుగా జూన్ 1 వ తేదీన కేరళలోకి నైఋతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందన్నారు. 

read more  వర్షసూచనతో అప్రమత్తమైన జీహెచ్ఎంసీ... భారీ నిధులతో ముందస్తు చర్యలు

ప్రస్తుతం చత్తీస్ గఢ్ మరియు దాని పరిసర ప్రాంతాలలో 2.1 కిమీ ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందన్నారు. చత్తీస్ గఢ్ నుండి లక్షదీవులు వరకు  తెలంగాణ, రాయలసీమ, దక్షిణ ఇంటీరియర్  కర్ణాటక మరియు కేరళ  మీదుగా 0.9 కిమీల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతోందన్నారు.

ఈరోజు ఆదిలాబాద్, నిర్మల్, కోమరంభీం,  నిజామాబాద్, జగిత్యాల మరియు కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. అలాగే అక్కడక్కడ ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులతో (గంటకు 30 నుండి 40 kmph) కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఈరోజు, రేపు కొన్నిచోట్ల, ఎల్లుండి చాలాచోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. 

click me!