బీజేపీ జై శ్రీరామ్ అంటే.. మనం జై హనుమాన్ అనాలి: టీఆర్ఎస్ కార్యకర్తలతో ఎమ్మెల్సీ కవిత

By Sumanth KanukulaFirst Published May 21, 2022, 4:38 PM IST
Highlights

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశంలో నిరుద్యోగం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరిందని ఆరోపించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రూపాయి విలువ పతనమయిందని అన్నారు. 

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశంలో నిరుద్యోగం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరిందని ఆరోపించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రూపాయి విలువ పతనమయిందని అన్నారు. జగిత్యాల జిల్లాలోని కోరుట్ల నియోజకవర్గంలో జరిగిన పార్టీ  కార్యకర్తల సమావేశంలో కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేవుడి పేరుతో బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తోందని... దేవుని పేరు చెప్పి బెదిరించాలని చూస్తే ఊరుకునేదిలేదని హెచ్చరించారు. 

దేవుడి కంటే భక్తుడే గొప్ప అని.. నాయకుడి కంటే ప్రజలే గొప్ప అని కవిత పేర్కొన్నారు. అవసరం అయితే దేవున్ని కూడా ప్రజలు ప్రశ్నిస్తారన్నారు. మోదీ హైతో ముష్కిల్‌ హై.. పాతాల్ మే జీడీపీ హై.. ఆస్మాన్‌మే బే రోజ్‌గార్ హై.. అని విమర్శించారు. బీజేపీ జై శ్రీ రామ్ అంటే... మనం జై హనుమాన్ అనాలని కార్యకర్తలకు చెప్పారు. దేవుడి పేరుతో రాజకీయం చేస్తే ఊరుకునేది లేదన్నారు. ఇంట్లో దేవుణ్ణి ఎగ్జిబిషన్ లాగా బయట పెట్టబోమన్నారు. తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదని విమర్శించారు.

తెలంగాణ తెచ్చుకున్నదే యువత కోసమని అన్నారు. తెలంగాణలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తోందన్నారు. రైతు బంధు, రైతు బీమా, ఆసరా పెన్షన్లు వంటి ఎన్నో గొప్ప పథకాలతో రాష్ట్రం దేశంలో నెంబర్ వన్ గా నిలిచిందన్నారు. మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో బీడీ కార్మికులకు రూ.700 పెన్షన్ ఇస్తోంటే... రాష్ట్రంలో మాత్రం రూ. 2 వేల పెన్షన్ ఇస్తున్నామని అన్నారు.

మరోవైపు కాంగ్రెస్‌ పార్టీపై కూడా కవిత విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.. కేసీఆర్‌ను తిట్టడం తప్ప చేసిందేమి లేదన్నారు. బీజేపీ నేతలపై ఆయన ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ రచ్చబండ పేరుతో గ్రామాలకు వస్తే.. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్దిని చూపించాలని కార్యకర్తలకు సూచించారు. 
 

click me!