
MLC Kavitha: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ గులాబీ దళం (టీఆర్ఎస్) యుద్దం ప్రకటించిందా అన్నట్లుగా వ్యవహరిస్తోంది.కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు నుంచి.. తెరాస నేతలు విమర్శాస్త్రాలను సంధిస్తున్నారు. తొలుత తెలంగాణ సీఎం కేసీఆర్ తనదైన శైలిలో కేంద్రంపై విరుచుకపడ్డారు. ప్రత్యేకంగా ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి.. కేంద్ర వైఖరిపై తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. ఆ తరువాత నుంచి.. సమయం దొరికితే చాలు.. కేంద్రంపై తెరాస నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో జాతీయస్థాయిలో బీజేపీపై పోరాడాలని, అవసరం అనుకుంటే కొత్త పార్టీ ఏర్పాటుకు వెనుకంజ వేయబోమని, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా పావులు కదుపుతున్నాడు. ఈ తరుణంలో మహారాష్ట్ర సీఎం తో భేటీ అయిన విషయం తెలిసిందేజజ
కేసీఆర్ సారథ్యంలోనే తన మంత్రి వర్గం నడుస్తోంది. ఇటీవల మంత్రి కేటీఆర్ కూడా కేంద్రంపై విమర్శలు గుప్పించారు. సింగరేణి బొగ్గు గనుల విషయంలో తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తుందనీ, అక్రమంగా వేస్తున్న బొగ్గు గనుల వేలాన్ని ఆపాలంటూ కేంద్ర గనుల శాఖ మంత్రికి కేటీఆర్ ఘాటు లేఖ రాశారు. ఈ గనులను వేలం లేకుండా సింగరేణి సంస్థకే కేటాయించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కేంద్రం.. సింగరేణిని కూడా ప్రైవేటు శక్తులకు అప్పగించేందుకు కుట్ర పన్నుతోందని మండిపడ్డారు
తాజాగా .. ఎమ్మెల్సీ కవిత కూడా కేంద్ర ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర రైతులపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపుతోందని, ఈ విషయం మరోసారి బయటపడిందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. యాసంగిలో తెలంగాణలో అధిక శాతం బాయిల్డ్ రైస్ ( ఉప్పుడు బియ్యం ) మాత్రమే ఉత్పత్తి అవుతుందని కేంద్ర ప్రభుత్వానికి, ఎఫ్‌సీఐకి తెలిసినా, రా రైస్ మాత్రమే కొంటామంటూ కేంద్రం మొండి వైఖరిని ప్రదర్శిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతులు పండించే పంటను కొనకుండా.. పండని పంటను కొంటామంటూ ప్రకటించి బీజేపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇదే తరుణంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ వ్యవసాయం గురించి ఏ మాత్రం అవగాహన లేని గౌరవ బండి సంజయ్ గారు, యాసంగిలో రాష్ట్రంలో ఏ రకం బియ్యం ఉత్పత్తి అవుతాయో తెలుసుకోవాలని సలహా ఇచ్చింది. ఆయనకు తెలియకపోతే రాష్ట్రంలో ఏ రైతును అడిగినా మీకు జ్ఞానోదయం చేయిస్తారని అన్నారు. బీజేపీ నేత అర్థ జ్ఞానంతో అన్నదాతలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ట్వీట్ చేశారు.