రేవంత్ మనిషి‌నైతే సీఎల్పీ నేత చెప్పిన పనులు ఎందుకు చేస్తాను?.. ఈగోలు పక్కనబెట్టి పనిచేయాలి: సీతక్క

By Sumanth KanukulaFirst Published Dec 22, 2022, 3:08 PM IST
Highlights

తెలంగాణ కాంగ్రెస్‌లో చోటుచేసుకున్న పరిణామాలను అధిష్టానం పరిష్కరిస్తుందని ఎమ్మెల్యే సీతక్క ధీమా వ్యక్తం చేశారు. అందరూ నేతలు కూడా ఒక్క అడుగు తగ్గి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.

తెలంగాణ కాంగ్రెస్‌లో చోటుచేసుకున్న పరిణామాలను అధిష్టానం పరిష్కరిస్తుందని ఎమ్మెల్యే సీతక్క ధీమా వ్యక్తం చేశారు. అందరూ నేతలు కూడా ఒక్క అడుగు తగ్గి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. గురువారం గాంధీభవన్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌తో భేటీ అనంతరం సీతక్క ఓ న్యూస్ చానల్‌తో మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారు. పార్టీ కోసం సీనియర్లు పనిచేస్తున్నారని, తాము కూడా ఐదారేళ్లుగా పనిచేస్తున్నామని చెప్పారు. అందరం ఈగోలు పక్కనబెట్టి కలిసికట్టుగా పనిచేయాలన్నదే తన అభిప్రాయమని తెలిపారు. తాను రేవంత్ రెడ్డి మనిషిని అయితే.. సీఎల్పీ నేత చెప్పిన పనులు ఎందుకు చేస్తానని ప్రశ్నించారు. అసెంబ్లీలో సీఎల్పీ నేత చెప్పినట్టుగానే వ్యవహరించామని చెప్పారు. పార్టీలో తనవంతు పాత్రను తాను పోషిస్తానని చెప్పారు.  

పాతోళ్లు, కొత్తోళ్లు ఎవరిదైనా తప్పు ఉంటే మాత్రం వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని అన్నారు. వలసవాదులు అనే మాట బాధ అనిపించిందని అన్నారు. తాము కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నామని చెప్పారు. వలసవాదులు అనే పదానికి మాత్రమే తాను బాధపడి రాజీనామా చేసినట్టుగా చెప్పారు. పార్టీని ఇబ్బంది పెట్టాలని, సీనియర్లను బద్నాం చేయాలని పదవులకు రాజీనామా చేయలేదని తెలిపారు.

ఇదిలా ఉంటే.. తెలంగాణ కాంగ్రెస్‌ నేతల మధ్య నెలకొన్న విభేదాలకు చెక్ పెట్టేందుకు రంగంలోకి దిగిన హైకమాండ్ దూత దిగ్విజయ్ సింగ్‌ గాంధీ భవన్‌లో ఆయన పలువురు నేతలతో విడివిడిగా సమావేశమవుతున్నారు. నేతలతో చర్చల అనంతరం దిగ్విజయ్ సింగ్‌ మీడియా ఈ రోజు సాయంత్రం మీడియాతో మాట్లాడతారని భావించినప్పటికీ.. అది వాయిదా పడింది. రేపు ఉదయం 11 గంటలకు దిగ్విజయ్ మీడియాతో మాట్లాడనున్నట్టుగా గాంధీ భవన్ వర్గాలు తెలిపాయి.

దిగ్విజయ్‌తో భేటీ అనంతరం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్‌ సింగ్‌తో పార్టీ అంతర్గత విషయాలు చర్చించానని తెలిపారు. పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉన్న సీనియర్లు, జూనియర్లు అంతా కలిసే పనిచేస్తున్నారని చెప్పారు. తాము విడిపోయామని భావించడానికి వీల్లేదని తెలిపారు. కాంగ్రెస్ నేతలందరూ ఐక్యంగానే ఉన్నారు. 

దిగ్విజయ్ సింగ్‌ పార్టీని ఎలా బలోపేతం చేయాలనేదానిపై చర్చించేందుకు ఇక్కడకు వచ్చారని చెప్పారు. కాంగ్రస్ పార్టీని సమిష్టిగా ముందుకు తీసుకెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు, సలహాలు స్వీకరిస్తున్నారని చెప్పారు. తాను కూడా తన సలహాలు, సూచనలు ఇచ్చానని తెలిపారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీనేని ధీమా వ్యక్తం చేశారు. 

click me!