రేపు అన్ని జిల్లా కేంద్రాల్లో బీఆర్ఎస్‌ ధర్నాలు.. కేంద్రం తీరుకు నిరసనగా నేతల పిలుపు..

By Sumanth KanukulaFirst Published Dec 22, 2022, 2:33 PM IST
Highlights

ఉపాధి హామీ పథకంలో భాగంగా రైతులు నిర్మించుకున్న పంట ఆరబోత కల్లాలపై కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆరోపించారు.

ఉపాధి హామీ పథకంలో భాగంగా రైతులు నిర్మించుకున్న పంట ఆరబోత కల్లాలపై కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం కల్లాల నిర్మాణాన్ని కావాలనే రాద్ధాంతం చేస్తుందని మండిపడ్డారు. రైతులకు అనేక విధాలుగా ఉపయోగపడే కల్లాల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం చేసిన సహాయాన్ని ఉపాధి హామీ నిధుల మళ్లింపు అంటూ కేంద్ర ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తున్నదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తోందని విమర్శించారు. రైతులకు ఉపయోగం కోసం కల్లాలు నిర్మిస్తే ఆ నిధులు వెనక్కి ఇవ్వమని అడగడమేమిటని అన్నారు. ఇదేనా కేంద్ర ప్రభుత్వానికి రైతులపై ఉన్న ప్రేమ అని ప్రశ్నించారు. 

కేంద్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా శుక్రవాంర రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కేంద్రాల్లో ధర్నా కార్యక్రమాలు నిర్వహించాలని బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలపునిచ్చారు. పెద్ద ఎత్తున రైతులు ఈ నిరసనలలో పాల్గొనాలని కోరారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ కార్యక్రమాలకు అనుసంధానం చేయాలని తాము ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరపున పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి అభ్యర్థించామని చెప్పారు. 

రాష్ట్ర ప్రభుత్వం అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వివక్షతో వ్యవహరిస్తోందని విమర్శించారు. రైతుల ప్రయోజనాల కోసం కల్లాలు నిర్మించిన మొదటి రాష్ట్రం తెలంగాణ అని గుర్తు చేశారు. మంచి పని చేస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని మెచ్చుకోవడానికి బదులు..  ప్రతిష్టను దిగజార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని  మండిపడ్డారు.

మరోవైపు కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం కల్లాలు ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేస్తుంటే, కేంద్రం అది తప్పని అంటుందని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం చేపల కోసం కల్లాలు ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇచ్చిందని.. అలాంటప్పుడు పంటలకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. రేపు అన్ని జిల్లాల్లోనూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు చేయాలని పార్టీ శ్రేణులకు మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు.

ఇక, నిజామాబాద్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతు వ్యతిరేకి అని విమర్శించారు. కేంద్రం విధానాలకు వ్యతిరేకంగా రైతులంతా మహాధర్నాలో పాల్గొని మహాధర్నాను విజయవంతం చేయాలని కోరారు. నిజామాబాద్ రైతుల సత్తా ఏమిటో చూపించాలని అన్నారు. 

click me!