
తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. మూడు స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులు కుర్మయ్యగారి నవీన్ కుమార్, దేశపతి శ్రీనివాస్, చల్లా వెంకట్రామిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. వారి నామినేషన్ పత్రాలను అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులకు అందజేశారు. బీఆర్ఎస్ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమానికి మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. బీఆర్ఎస్ అభ్యర్థులు నామినేషన్ దాఖలుకు ముందు.. గన్‌పార్కు వద్ద అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు.
ఇదిలా ఉంటే.. తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలకు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మూడు స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. కుర్మయ్యగారి నవీన్ కుమార్, దేశపతి శ్రీనివాస్, చల్లా వెంకట్రామిరెడ్డి పేర్లను ఖరారు చేశారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీకి భారీ బలం ఉన్న నేపథ్యంలో వీరి ఎన్నిక లాంఛనం కానుంది.
అభ్యర్థుల విషయానికి వస్తే.. కుర్మయ్యగారి నవీన్ కుమార్ ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీగా ఉన్న మైనంపల్లి హన్మంతరావు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఆ స్థానం ఖాళీ అయింది. 2019లో ఆ స్థానానికి జరిగిన ఉపఎన్నిక ద్వారా నవీన్ కుమార్ శాసన మండలిలో అడుగుపెట్టారు. ఇక, నవీన్ కుమార్ తెలంగాణ ఉద్యమం నుంచి కేసీఆర్‌తో కలిసి పనిచేశారు. కేసీఆర్ కుటుంబానికి దగ్గరి వ్యక్తి అనే పేరుంది. ఈ క్రమంలోనే నవీన్ కుమార్‌ను మరోసారి మండలికి పంపాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.
చల్లా వెంకట్రామి రెడ్డి మాజీ రాష్ట్రపతి నీలం సంజీవ రెడ్డి మనవడు. 2004లో అలంపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్తిగా బరిలో నిలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. అయితే గతేడాది డిసెంబర్‌లో కేసీఆర్ సమక్షంలో చల్లా వెంకట్రామిరెడ్డి గులాబీ కండువా కప్పకున్నారు. వెంకట్రామిరెడ్డికి మండలి సీటుపై సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని ఆ సమయంలోనే ఊహాగానాలు వచ్చాయి.
కవి, రచయిత దేశపతి శ్రీనివాస్ తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. తెలంగాణ యాసను, భాషను ప్రజల్లోకి తీసుకెళ్లి ఉద్యమ ఆకాంక్షను చాటడంలో తనవంతు పాత్ర పోషించారు. ప్రస్తుతం ఆయన సీఎం ఓఎస్డీగా ఉన్నారు. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో.. దేశపతిని సీఎం కేసీఆర్ శాసనమండలికి పంపుతారనే ప్రచారం సాగింది. కానీ అలా జరగలేదు. కానీ ఈసారి మాత్రం ఆయనకు కేసీఆర్ అవకాశం కల్పించారు. దీంతో దేశపతి శ్రీనివాస్ బుధవారం ఓస్డీ పదవికి రాజీనామా చేశారు.