బంధువులాగా ప్రతి ఇంటికీ... ఒకే రోజు 35 పెళ్లిళ్లకు హాజరైన ఈటల రాజేందర్, జనం ప్రశంసలు

By Siva KodatiFirst Published Dec 8, 2021, 10:33 PM IST
Highlights

హుజూరాబాద్ నియోజకవర్గంలో (huzurabad) ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటారని, ప్రజల ఇళ్లలో జరిగే శుభకార్యాలకు, ఇతర కార్యక్రమాలకు హాజరై వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కి (etela rajender) పేరు ఉంది

హుజూరాబాద్ నియోజకవర్గంలో (huzurabad) ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటారని, ప్రజల ఇళ్లలో జరిగే శుభకార్యాలకు, ఇతర కార్యక్రమాలకు హాజరై వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కి (etela rajender) పేరు ఉంది. తాజాగా ఆ పేరు మరోసారి సార్థకమైంది. ఇవాళ ఒక్కరోజే ఉదయం నుంచి రాత్రి వరకు నియోజకవర్గంలో 35 వివాహ కార్యక్రమాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు ఈటల రాజేందర్. క్షణం సమయం కూడా వృధా చేయకుండా మొత్తం 35 పెళ్లి మండపాలను చుట్టి వచ్చారు. నియోజకవర్గంలో తనను వివాహానికి ఆహ్వానించిన ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వచ్చారు. తమ అభిమాన నాయకుడు హాజరై ఆశీర్వదించడం పట్ల కొత్త పెళ్లిజంటలు, వారి కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

 

 

కాగా.. హుజురాబాద్ ఉపఎన్నికను (huzurabad bypoll) ఈటల రాజేందర్, TRS, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. తెలంగాణలో బలపడటానికి శాయశక్తుల ప్రయత్నిస్తున్న బీజేపీ హుజురాబాద్‌లో గెలుపొంది తీరాలని భావించింది. అధికార టీఆర్ఎస్‌పైనే తిరుగుబాటు జెండా ఎగరేసి మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఈటల రాజేందర్‌కు ఈ ఉపఎన్నిక చావో రేవో అన్నట్టుగా మారింది. 

 

 

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ ఉపఎన్నికలో విజయం సాధించి పార్టీ శ్రేణుల్లో మరింత ఆత్మ విశ్వాసాన్ని పెంచాలని టీఆర్ఎస్ యోచించింది. అందుకే మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు విస్తృత ప్రచారం చేశారు. అయినప్పటికీ ఓటమి తప్పలేదు. ఈటల రాజేందర్ విజయం సాధించారు. ఈ గెలుపు తర్వాత ఈటల రాజేందర్ రాష్ట్రవ్యాప్త పర్యటనకు యోచిస్తున్నారు. టీఆర్ఎస్ టార్గెట్‌గా ఆ పర్యటన ఉండాలని సమాలోచిస్తున్నట్టు సమాచారం. తెలంగాణలో తిరుగులేని శక్తిగా ఉన్న టీఆర్ఎస్‌కు ముచ్చెమటలు పట్టించి విజయ తీరానికి చేరిన ఈటల రాజేందర్‌కు పార్టీలో కీలక పదవి(Key Position) ఇవ్వాలని బీజేపీ యోచిస్తున్నట్టు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతున్నది.

 

 

టీఆర్ఎస్‌ను ఢీకొట్టిన రాజేందర్‌ను సరిగ్గా వినియోగించి బీజేపీని మరింత ఎత్తుకు తీసుకెళ్లాలని బీజేపీ నాయకత్వం ఆలోచనలు చేస్తున్నట్టు టాక్ నడుస్తున్నది. మొదటి నుంచి బీజేపీలో కొనసాగుతున్న నేతల మనోభావాలు దెబ్బతినకుండా, వారిని తక్కువ చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఈటలకు ఓ కీలక పదవి ఇచ్చే అవకాశాలున్నట్టు తెలుస్తున్నది. టీఆర్ఎస్‌ను దీటుగా ఎదుర్కొన్న ఈటలను క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్‌గా నియమించాలని యోచిస్తున్నట్టు పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతున్నది. అంతేకాదు, బెయిల్ పై విడుదలైన తీన్మార్ మల్లన్నకు ఓ పదవి దక్కే అవకాశముందని చర్చ.

click me!