
హైదరాబాద్: దాదాపు 9 నెలల పాటు అమెరికాలో కనిపించకుండా పోయిన టెక్కీ ఆచూకీ లభించింది. హైదరాబాదులోని సైదాబాద్‌కు చెందిన రాఘవేంద్ర జాడ తెలిసింది. రాఘవేంద్ర అమెరికాలోనే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
రాఘవేంద్రతో అతని తల్లిదండ్రులు ఫోన్‌లో మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి. వ్యక్తిగత కారణాలతో రాఘవేంద్ర 9 నెలలుగా అజ్ఞాతంలో ఉన్నట్లు తెలుస్తోంది. రాఘవేంద్రను స్వదేశానికి రప్పించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.
రాఘవేంద్ర 2011లో అమెరికాకు వెళ్లాడు. కాల్నిపోర్నియాలోని మైక్రోసాప్ట్ సంస్థలో ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అతని తల్లిదండ్రులు హైదరాబాదులో ఉంటున్నారు. 2017 అక్టోబరు21న తండ్రికి ఫోన్ చేసి త్వరలో తాను ఇంటికి వస్తానని చెప్పాడు. అదే అతడి నుంచి వచ్చిన చివరి ఫోన్‌కాల్. కానీ అతని నుంచి ఫోన్ రావడం గానీ, అతను ఇండియాకు రావడం గానీ జరగలేదు.
తల్లిదండ్రులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచాఫ్ అనే వస్తోంది. దీంతో తమ కుమారుడికి ఏమైందోనని ఆ తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తన కుమారుడి అదృశ్యంపై ఈ నెల 11న సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తమ కుమారుడి అచూకీ కనిపెట్టాలని వారు విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ ను వేడుకున్నారు. దాంతో రాఘవేంద్ర జాడ తెలిసింది.