తన రాజకీయ జీవితం ఎన్టీఆర్ పెట్టిన బిక్ష అని, తన ప్రాణం వున్నంత వరకు ఆయనను మరిచిపోనన్నారు బీఆర్ఎస్ నేత, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ . 1994లో ఎన్టీఆర్ నాటిన తలసాని శ్రీనివాస్ యాదవ్ అనే మొక్క నేడు వృక్షంగా మారిందన్నారు.
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ వ్యవహారం తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేస్తూనే వుంది. రాష్ట్రానికి చెందిన అన్ని ప్రధాన పార్టీల నేతలు చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తూనే వున్నారు. ఈ స్టంట్‌లన్నీ తెలంగాణలో స్థిరపడిన ఆంధ్రా సెటిలర్ల ఓట్ల కోసమేనన్న ఆరోపణలు వినిపిస్తూనే వున్నాయి. తాజాగా బీఆర్ఎస్ నేత, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కమ్మసేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన కార్తీక వన మహోత్సవంలో శనివారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. తన రాజకీయ జీవితం ఎన్టీఆర్ పెట్టిన బిక్ష అని, తన ప్రాణం వున్నంత వరకు ఆయనను మరిచిపోనన్నారు.
అమీర్‌పేటలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు. 1994లో ఎన్టీఆర్ నాటిన తలసాని శ్రీనివాస్ యాదవ్ అనే మొక్క నేడు వృక్షంగా మారిందన్నారు. చంద్రబాబు అరెస్ట్ విషయంలో జగన్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును తలసాని ఖండించారు. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదని.. నేడు రూలింగ్‌లో వున్నామని వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలకు దిగడం సరికాదన్నారు. చంద్రబాబు అరెస్ట్‌ను తాను ఇంతకుముందే ఖండించానని.. ఎన్నికల్లో ఓట్ల కోసం తాను ఈ వ్యాఖ్యలు చేయడం లేదని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.
Also Read: చంద్రబాబు అరెస్ట్ : ‘‘బాబుతో నేను’’ కార్యక్రమానికి తలసాని సంఘీభావం, స్వయంగా దీక్షా శిబిరానికి
కాగా.. కొద్దిరోజుల క్రితం చంద్రబాబు అరెస్ట్‌ను తలసాని శ్రీనివాస్ యాదవ్ ఖండించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తలసాని ఎక్స్ (ట్విట్టర్)లో పోస్టు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మంత్రిగా పని చేశాను.. వారి అరెస్ట్ వ్యక్తిగతంగా తనకెంతో బాధను కలగచేసిందని పేర్కొన్నారు. అధికారం శాశ్వతం కాదు.. ఒకప్పుడు కేంద్ర రాజకీయాలలో కీలకపాత్ర పోషించిన సీనియర్ నాయకులు చంద్రబాబు నాయుడని అన్నారు.