Minister Srinivas Goud: 'కేవలం ఎన్నికలప్పుడే వచ్చే నాయకులను నమ్మొద్దు'

By Rajesh Karampoori  |  First Published Sep 27, 2023, 1:32 AM IST

Minister Srinivas Goud:  ఎన్నికలు సమీపించడంతో వివిధ డిక్లరేషన్ల పేరిట కాంగ్రెస్ పార్టీ, బూటకపు హామీలతో బిజెపి గ్రామాలకు వచ్చి ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్   విమర్శించారు


Minister Srinivas Goud: ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ప్రతిపక్ష పార్టీలు జిమ్మిక్కులను ప్రారంభించాయని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ ( Minister Srinivas Goud ) అన్నారు. ఎస్సీ, గిరిజన, బీసీ, మైనార్టీ డిక్లరేషన్ల పేరిట ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నాయని ఆరోపించారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి రాష్ట్రాన్ని పాలించిన వాళ్ళు కనీసం తాగడానికి మంచి నీళ్లు కూడా ఇవ్వలేదని, వారి పాలన అంతమైన తర్వాతే స్వచ్ఛమైన మిషన్ భగీరథ తాగునీరు వస్తోందని   రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలంలో మంగళవారం నాడు సుడిగాలి పర్యటన చేసిన మంత్రి.. మండలంలోని పలు గ్రామాల్లో రూ. 6.01 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. 

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ బహిరంగ సభలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ఎన్నికలు సమీపించడంతో వివిధ డిక్లరేషన్ల పేరిట కాంగ్రెస్ పార్టీ, బూటకపు హామీలతో బిజెపి గ్రామాలకు వచ్చి ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారని ఆయన  విమర్శించారు. కర్ణాటక, మహారాష్ట్రలో తెలంగాణలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలు ఉన్నాయా... తెలంగాణలో ఇస్తున్న ఆసరా పింఛన్లు రూ. 2016, రూ. 4016 ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Latest Videos

ప్రస్తుతం అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే అమలు చేయని వారు.. ఇక్కడ ఎలా ఇస్తారా అని ప్రశ్నించారు. ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ స్థాయి పథకాలను అమలు చేయాలని మంత్రి సూచించారు. కేవలం ఎన్నికల అప్పుడు మాత్రమే ప్రజల్లోకి వచ్చే పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. తాగు, సాగునీరు, రోడ్లు వంటి మౌలిక వసతులు కూడా కల్పించకుండానే 70 ఏళ్ళు పాలించిన పార్టీల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని హితవు చెప్పారు. 

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని, చెరువులన్నింటి నింపి అన్నదాతలు మూడు పంటలు పండించుకునే పరిస్థితిని తీసుకువస్తామని హామీ ఇచ్చారు. వేపూరులో రెండు చెక్ డ్యాములు ఏర్పాటు చేయడం వల్ల బోర్లు, బావులు రీఛార్జ్ అయ్యాయని, త్వరలో మరో నాలుగు చెక్ డ్యామ్ లు ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు.  

గతంలో నిర్లక్ష్యానికి గురైన తాండాలలో  తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత హమారా తాండమే హమారా రాజ్ తీసుకువచ్చి ఊహించని విధంగా అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. రైతుబంధు, రైతు బీమా, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, దళిత బంధు సహా అనేక సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే అమలవుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే రోజంతా బాగుపడ్డారని, భవిష్యత్తులోనూ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడితే మరింత అభివృద్ధి కార్యక్రమాలు సాధ్యమవుతాయన్నారు. 
 

click me!