విపక్ష నేతలకు ఓటు అడిగే హక్కు లేదని తెలంగాణ మంత్రి మల్లారెడ్డి చెప్పారు. ఓటు అడిగేందుకు వచ్చే విపక్షాలను నిలదీయాలని మంత్రి కోరారు.
నిజామాబాద్: కాంగ్రెస్, బీజేపీ నేతలు ఓట్లు అడిగేందుకు వస్తే చీపుర్లతో కొట్టాలని తెలంగాణ మంత్రి మల్లారెడ్డి మహిళలను కోరారు.
మంగళవారంనాడు నిజామాబాద్ లో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. ప్రజలకు ఏం చేశారని మీకు ఓట్లు అడిగే హక్కుందా అని బీజేపీ, కాంగ్రెస్ నేతలనుద్దేశించి మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. ఓట్ల కోసం వచ్చే విపక్ష నేతలను నిలదీయాలని మంత్రి మల్లారెడ్డి కోరారు.
మీ దగ్గర అరవింద్ ఎలా ఎంపీ అయ్యాడో తమ దగ్గర రేవంత్ రెడ్డి కూడా ఎంపీ అయ్యాడన్నారు. ఎంపీగా విజయం సాధించిన తర్వాత రేవంత్ రెడ్డి నియోజకవర్గానికి రావడం లేదని మంత్రి మల్లారెడ్డి విమర్శించారు. రోడ్లు పట్టుకుని తిరుగుతున్నాడని చెప్పారు.
అధికారంలోకి ఎలా వస్తారని మంత్రి మల్లారెడ్డి కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. రోడ్ల వెంట తిరుగుతూ తెలంగాణలో తమదే అధికారమని రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రచారం గురించి మంత్రి మల్లారెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేసీఆర్ పాలనలో తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు ఆనందంలో ఉన్నారని ఆయన చెప్పారు.
నిజామాబాద్ లో బీజేపీని గెలిపిస్తే పసుపు బోర్డు రాలేదని ఆయన విమర్శించారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలతో బీజేపీ పనైపోయిందన్నారు.
బీజేపీ పాలిత రాష్ట్రాలకు తెలంగాణ మోడల్ గా నిలిచిపోయిందని మంత్రి మల్లారెడ్డి తెలిపారు.