పనిచేయకుంటే పదవులు పోతాయి..గెలిచినోళ్లంతా యాదికుంచుకోండి: కేటీఆర్ వార్నింగ్‌

By Siva KodatiFirst Published Jan 27, 2020, 4:21 PM IST
Highlights

ఎన్నికల్లో గెలిచిన  ప్రతి ఒక్కరు కొత్త మున్సిపల్ చట్టాన్ని అర్థం చేసుకోవాలని.. పనిచేయకపోతే పదవులు పోతాయని కేటీఆర్ హెచ్చరించారు.

ఎన్నికల్లో గెలిచిన  ప్రతి ఒక్కరు కొత్త మున్సిపల్ చట్టాన్ని అర్థం చేసుకోవాలని.. పనిచేయకపోతే పదవులు పోతాయని కేటీఆర్ హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ ఎవరికీ అందనంత దూరంగా ఉందన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.

సోమవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన తమ ప్రత్యర్ధులు చాలా చోట్ల తిప్పలు పడ్డారని, ఎలాగైనా విజయం సాధించాలని కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యారని కేటీఆర్ మండిపడ్డారు.

కాంగ్రెస్, బీజేపీలు పేరుకే ఢిల్లీ పార్టీలనీ.. చేసేవన్నీ సిల్లీ పనులని కేటీఆర్ సెటైర్లు వేశారు. జాతీయ పార్టీలుగా చెప్పుకునే రెండు పార్టీలు ఒక ప్రాంతీయ పార్టీ అయిన టీఆర్ఎస్‌ను ఎదుర్కోలేక పొత్తు పెట్టుకునే పరిస్ధితి వచ్చిందన్నారు. 

Also Read:కొత్త సచివాలయ నిర్మాణంపై కేసీఆర్‌ సర్కార్‌కు హైకోర్టు కీలక ఆదేశాలు

ఇద్దరు కలిసి కొన్ని చోట్ల ఛైర్మన్ సీటును పంచుకున్నారని ఆయన గుర్తుచేశారు. మక్తల్‌లో బీజేపీ ఛైర్మన్ అయితే కాంగ్రెస్ పార్టీ మద్ధతు ఇచ్చిందని, మణికొండలో కాంగ్రెస్ ఛైర్మన్.. బీజేపీ వైఎస్ ఛైర్మన్ ఇలా కొన్ని ఉదాహరణలు ఉన్నాయన్నారు.

119 మున్సిపాలిటీల్లో జయకేతనం ఎగురవేశామని, 10కి పది కార్పోరేషన్లను కైవసం చేసుకున్నామని కేటీఆర్ గుర్తుచేశారు. ఈ విజయం అనితర సాధ్యమని, కలలో కూడా ఊహించలేమని ఆయన దీనిని అందించిన ప్రజలకు ఎప్పుడూ రుణపడి వుంటామని మంత్రి తెలిపారు.

తెలంగాణలో పట్టణీకరణ వేగంగా జరుగుతోందని, ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. శాస్త్రీయంగా జనాభా ప్రతిపాదికన పట్టణాలు, నగరాల్లో వార్డుల విభజన చేపట్టామని మంత్రి తెలిపారు.

కొత్త అర్బన్ పాలసీ, మున్సిపల్ చట్టం రూపొందించామని.. పల్లెప్రగతి లానే పట్టణ ప్రగతి చేపడతామని కేటీఆర్ పేర్కొన్నారు. కొత్తగా ఎంపికైన ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లు, మేయర్లు, ఉప మేయర్లు, కౌన్సిలర్లు, కార్పోరేటర్లకు కొత్త మున్సిపల్ చట్టంలోని ముఖ్యమైన అంశాలపై శిక్షణ ఇస్తామని కేటీఆర్ తెలిపారు. 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మున్సిపాలిటీకి రూ.2,074 కోట్లు విడుదలవుతాయన్నారు. ప్రతి నెల మొదటి వారంలో ప్రతి మున్సిపాలిటీకి అందజేస్తామని మంత్రి వెల్లడించారు. కొత్త మున్సిపల్ చట్టంలో పారదర్శకమైన అనుమతుల విధానాన్ని తీసుకొచ్చామన్నారు.

Also Read:దుర్మార్గంగా అడ్డుకుంటున్నారు: కేవీపీ ఓటు హక్కు గొడవపై ఉత్తమ్

అవినీతికి ఆస్కారం లేకుండా భవన నిర్మాణ అనుమతులతో పాటు ఇతర అనుమతులు పారదర్శకంగా అందజేస్తామని కేటీఆర్ వెల్లడించారు. పురపాలనలో పౌరుల భాగస్వామ్యం ఉండేలా సెల్ఫ్ సర్టిఫికేషన్ విధానాన్ని తీసుకొచ్చామన్నారు.

ప్రతి డివిజన్/వార్డులో నాలుగు రకాల కమిటీలు ఉంటాయన్నారు. ఒక మున్సిపాలిటీలో రిక్రూట్‌ అయిన ఉద్యోగిని రాష్ట్రంలో ఎక్కడికైనా ట్రాన్స్‌ఫర్ చేసే విధానం అమల్లోకి తీసుకొస్తామని కేటీఆర్ తెలిపారు. ఉద్యోగస్తులు ఎవరైనా తప్పులు చేస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.  

కలెక్టర్ల నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశామని ఎక్కడైనా అక్రమ లేఔట్లు వేసినా, భవనాలు కట్టినా, నిబంధనలు సరిగా అమలు చేయకపోయినా.. నోటీసులు ఇవ్వకుండా కూల్చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని కేటీఆర్ తెలిపారు. 

click me!