మతం చిచ్చుపెట్టి.. ఆ మంటల్లో బీజేపీ చాలికాచుకుంటుంది: ఖమ్మంలో మంత్రి కేటీఆర్

Published : Jun 11, 2022, 01:00 PM IST
మతం చిచ్చుపెట్టి.. ఆ మంటల్లో  బీజేపీ చాలికాచుకుంటుంది: ఖమ్మంలో మంత్రి కేటీఆర్

సారాంశం

తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శనివారం ఖమ్మంలో పర్యటించారు. అక్కడ పలు అభివృద్ది కార్యక్రమాలను కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. బీజేపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశంలో 30 ఏళ్లలో కులపిచ్చి, మతపిచ్చి ఎక్కువైందని విమర్శించారు.  

దేశంలో 30 ఏళ్లలో కులపిచ్చి, మతపిచ్చి ఎక్కువైందని తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మంత్రి కేటీఆర్ శనివారం ఖమ్మంలో పర్యటించారు. అక్కడ పలు అభివృద్ది కార్యక్రమాలను కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. 2014లో తెలంగాణ రాకముందు ఖమ్మం పట్టణం ఎలా ఉందో.. ఇప్పుడు ఎలా ఉందో ఒక్కసారి ఆలోచన చేయాలని కోరారు. ఖమ్మం కార్పొరేషన్‌లో జరుగుతున్న అభివృద్ది మరో కార్పొరేషన్‌లో జరగడం లేదన్నారు. ఆయన ప్రాంతం అభివృద్ది చెందాలనే తపన ఉన్న నాయకుడు పువ్వాడ అజయ్ కుమార్ అని అన్నారు. 

అదే సమయంలో కేంద్రంలోని బీజేపీపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. దేశంలో కులం, మతం పేరుతో చిచ్చు పెట్టి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులు రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. బీజేపీ మత విద్వేషాలను రెచ్చగోడుతుందని మండిపడ్డారు. మతం చిచ్చుపెట్టి.. ఆ మంటల్లో చాలికాచుకుంటుందని విమర్శించారు. విద్వేషం తప్ప మరేదానిపై బీజేపీకి చిత్తశుద్ది లేదన్నారు. ఇతర మతాలపై విషయం చిమ్మే వ్యక్తులు రాజకీయ నాయకులు ఎలా అవుతారని ప్రశ్నించారు. దేశంలో ఎందుకు ఈ విపరీత ధోరణులు ఎందుకు కనిపిస్తున్నాయో ఆలోచన చేయాలన్నారు. 

రెడ్లకు పగ్గాలు ఇస్తేనే తాము అధికారంలోకి వస్తామని రేవంత్ అంటున్నారని.. అలాంటి కుల పిచ్చి వాళ్లు కావాలా?, అన్ని కులాల వాళ్లు కావాలనే కేసీఆర్ కావాలా? అని అడిగారు. కులం ఒక్కటే ఓట్లేస్తే కుల సంఘానికి నాయకుడు అవుతారని అన్నారు. కాంగ్రెస్‌కు 50 ఏళ్లు ఓట్లు వేస్తే వారు ఏం చేశారని ప్రశ్నించారు. చాలా కాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్.. టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను ఎందుకు తీసుకురాలేకపోయిందని ప్రశ్నించారు. కొత్తగా ఆ పార్టీ చేసేదేమీ ఉండదన్నారు. 35 ఏళ్లలో చైనా ఆర్థిక శక్తిగా ఎదిగిందని.. కానీ భారతదేశంలో ఎందుకు జరగడం లేదో ఆలోచన చేయాలన్నారు. 

ఇక, ఈ రోజు ఉదయం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావులతో కలిసి కేటీఆర్.. అష్ట‌ల‌క్ష్మి అమ్మ‌వారిని ద‌ర్శించుకున్నారు. అనంత‌రం ల‌కారం చెరువుపై నిర్మించిన కేబుల్ వంతెన‌ను కేటీఆర్ ప్రారంభించారు. రూ. 11.75 కోట్ల‌తో తీగ‌ల వంతెన‌ను నిర్మించారు. మ్యూజిక‌ల్ ఫౌంటైన్, ఎల్ఈడీ లైటింగ్‌ను ప్రారంభించారు. ర‌ఘునాథపాలెంలో రూ. 2 కోట్ల‌తో నిర్మించిన ప్ర‌కృతి వ‌నాన్ని ప్రారంభించారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
School Holidays : నెక్ట్స్ వీక్ లో వరుసగా రెండ్రోజులు సెలవులు ఖాయం.. మరో రెండ్రోజులు కూడానా?