
మునుగోడు ఉప ఎన్నికలో అసాధారణ పరిస్థితులు కనిపిస్తున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. తాము 8 ఏళ్లలో చేసిన అభివృద్దిని చెబుతూ ఉప ఎన్నికలో ఓట్లు అడుగుతున్నామని చెప్పారు. చేసింది చెప్తున్నామని.. చేసేది చెబుతూ ఓట్లు అడుగుతున్నామని తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం వ్యక్తిగత దూషణలే తప్ప.. 8 ఏళ్లలో చేసిందేమీ లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. శనివారం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ తరఫున, మునుగోడు ప్రజల తరఫున జూటా, జూమ్లా పార్టీ బీజేపీపై చార్జ్‌షీట్‌ను దాఖలు చేస్తున్నామని చెప్పారు. ఇందులో నిర్ధిష్టమైన ఆరోపణలు చేస్తున్నామని తెలిపారు.
ఫ్లోరోసిస్ సమస్యపై బీజేపీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మిషన్ భగీరథ నిధులు ఇవ్వాలని నీతి అయోగ్ సిఫార్సు చేసిన కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. నల్గొండ జిల్లాను బీజేపీ పట్టించుకోలేదని విమర్శించారు. ఏ ప్రధాని చేయని తప్పు మోదీ చేశారని ఆరోపించారు. చేనేతపై పన్ను వేసిన తొలి ప్రధాని మోదీనేనని అన్నారు.
ఈ ఛార్జ్ షీట్ లో పేర్కొన్న అంశాలు కొన్ని మాత్రమేనని చెప్పారు. భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి, తెలంగాణ రాష్ట్రానికి చేసిన ద్రోహాలు అంతులేనివని అన్నారు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి మొదలుకొని ఈరోజు దాకా ప్రతిక్షణం తెలంగాణ పట్ల విపరీతమైన వ్యతిరేక ధోరణితో పనిచేస్తున్న బీజేపి అన్ని రంగాల్లో తెలంగాణకి చేసిన అన్యాయాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రజలు ఆ పార్టీకి తగిన శిక్ష విధిస్తారన్న నమ్మకం తమకు ఉందని చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటర్లు బీజేపీని ఒక దోషిగా నిలబెట్టి, తగిన బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు.
బీజేపీకి ఓటు - మునుగోడుకు చేటు అంటూ దాఖలు చేసిన చార్జ్‌షీటులోని ముఖ్య అంశాలు యథాతథంగా..
-మునుగోడు ఫ్లోరైడ్ గోడు వినలేదు!.. ఫ్లోరైడ్ మహమ్మారిని మట్టుబెట్టి..మంచినీళ్లు ఇచ్చేందుకు చేపట్టిన మహత్తర పథకం మిషన్ భగీరథకు రూ. 19 వేల కోట్లు ఇవ్వాలని నీతిఆయోగ్ సిఫారసు చేస్తే నీతిలేని మోదీ సర్కారు 19 పైసలు కూడా ఇయ్యలేదు. కానీ..ఒక చిన్న కంపెనీ ఓనర్నని చెప్పుకుంటున్న రాజగోపాల్ రెడ్డికి రూ. 18 వేల కోట్ల పెద్ద కాంట్రాక్ట్ ను కట్టబెట్టారు బీజేపీ పెద్దలు. మర్రిగూడలో 300 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామని 2016లో నాటి కేంద్ర ఆరోగ్యమంత్రి జేపీ నడ్డా ఇచ్చిన హామీని తుంగలో తొక్కారు.
-మగ్గానికి మరణ శాసనం - చేనేతకు ఉరి .. చేనేతపై 5 శాతం జీఎస్టీ విధించమే కాదు. దానిని 12 శాతానికి పెంచాలని దుర్మార్గమైన ఆలోచన చేసి...బట్టలు నేసే వాళ్ళ పొట్ట కొట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నది మోదీ ప్రభుత్వం. స్వాతంత్ర స్వర్ణోత్సవాల కోసం జాతీయ జెండాల తయారీని దేశ నేతన్నలకు అప్పగించకుండా, చైనా నుంచి దిగుమతి చేసుకునే దౌర్భాగ్యం పట్టించింది ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వం.
-మోటర్లకు మీటర్లు - ఉచిత విద్యుత్‌కు ఉరి.. బాయికాడ మోటర్లకు మీటర్లు పెట్టాల్సిందే, నెలనెలా రైతు కరెంట్ బిల్లు కట్టాల్సిందేనని రాష్ట్రాల మెడమీద కత్తిపెట్టి బెదిరిస్తున్నది మోదీ సర్కారు. యాదాద్రి ఆల్ట్రా మెగా పవర్‌ప్లాంట్‌కు రుణాలు నిలిపేసి, ప్రాజెక్టుకు అడ్డుపుల్లలు వేస్తూ తెలంగాణను చీకట్లోకి నెట్టాలని కుట్రలు చేస్తున్నది కేంద్రం.
-కృష్ణా జలాలపై నికృష్ట రాజకీయం..కృష్ణానది జలాల్లో తెలంగాణ వాటా తేల్చకుండా నికృష్ట రాజకీయం చేస్తున్నది కేంద్రంలోని బీజేపీ. సెక్షన్ 3 కింద ట్రిబ్యునల్‌కు రిఫర్ చెయ్యాలని 8 ఏండ్ల నుంచి కోరుతున్నా...అంతులేని జాప్యం చేస్తూ తెలంగాణ నీటి హక్కులను కాలరాస్తున్నది.
-వంటగదిలో మంటపెట్టిన మోదీ.. నరేంద్ర మోదీ హయాంలో సిలిండర్ ధర వెయ్యి రూపాయలు దాటింది..మళ్లీ కట్టెల పొయ్యి వాడాల్సిన పరిస్థితి దాపురించింది. వంట గదిలో సిలిండర్ మంటలు పెట్టి, ఆడబిడ్డల కంట కన్నీళ్లు తెప్పిస్తున్నది కేంద్రం. 2014లో 410 రూపాయలు వున్న గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు 1100 రూపాయలు దాటింది. పేదల బతుకులకు గుదిబండగా మార్చింది.
-జనంపై పెట్రో బాంబు.. ధరల దాడి.. అడ్డగోలుగా ఎక్సైజ్ సెస్సు లు వడ్డించి, పెట్రోల్ డిజీల్ ధరలను సెంచరీ దాటించిన ఘనడు మోదీ. ముడి చమురు ధర పెరగకున్నా, అదనపు సెస్సులు మోత మోగించి మోదీ చమురు రేట్లను పెంచి, జనం చేతి చమురు వదిలించింది బీజేపీ ప్రభుత్వం. నిత్యావసర వస్తువులు ధరల దాడిలో సామాన్యుల బతుకు అల్లకల్లోలమైంది.
-గిరిజన రిజర్వేషన్లకు మోకాలడ్డు.. పెరిగిన జనాభాకు అనుగుణంగా ఎస్టీ రిజర్వేషన్లు 10 శాతానికి పెంచాలని రాష్ట్ర అసెంబ్లీ చేసిన తీర్మానానికి ఆమోదం చెప్పకుండా 5 ఏండ్లు తొక్కిపెట్టి గిరిజన ద్రోహానికి పాల్పడింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.
-బీసీలపైన కపట ప్రేమ.. బీసీల జనగణన చేయాలని వస్తున్న బీసీ వర్గాల చేస్తున్న డిమాండ్‌ను కేంద్రం పట్టించుకోవడం లేదు. అనేక రాష్ట్రాలు అసెంబ్లీలో తీర్మానాలు చేసి పంపినా, మోదీ సర్కారు మొండిగా వ్యవహరిస్తూ బహుజన ప్రజల ఆకాంక్షను పక్కన పడేసింది.
-ఉచితాలపై దాడి, సంక్షేమానికి సమాధి.. కార్పొరేట్ దోస్తుల సేవలో తరిస్తున్న కాషాయ పార్టీ పేదల సంక్షేమ పథకాలకు ఎసరు పెట్టేందుకు ఉచితాలు వద్దని కొత్త పాట పాడుతున్నది.
-నిరుద్యోగులను నిండా ముంచారు.. ఏటా 2 కోట్ల కొలువులు ఇస్తామని హామీ ఇచ్చి గద్దెనెక్కిన బీజేపీ ప్రభుత్వం ఈ దేశ నిరుద్యోగ యువతను నిండా ముంచింది.
8 ఏండ్లలో ఇవ్వాల్సిన 16 కోట్ల ఉద్యోగాల లెక్క చెప్పమని ప్రశ్నిస్తే పకోడీలు, బజ్జీలు ముచ్చట్లు చెబుతున్నరు.
-నల్లధనం - తెల్లముఖం.. విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న బ్లాక్ మనీని రప్పిస్తామని రంకెలు వేసినవాళ్ళు, ఇప్పుడు నల్లధనం ఎక్కడా అని అడిగితే తెల్లముఖం వేస్తున్నారు. ప్రతీ ఒక్కరి జన్ ధన్ ఖాతాల్లో ధన్ ధన్ మని రూ. 15 లక్షల వేస్తామని, మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని, ఇప్పడేమో దాన్ని ఎలక్షన్ జుమ్లా అని కొట్టిపారేస్తున్నారు.
-విభజన చట్టానికి తూట్లు.. కాజీపేట కోచ్ ఫాక్టరీ విషయంలో నయవంచనకు పాల్పడింది మోదీ సర్కారు. ఇక్కడ పెట్టాల్సిన కోచ్ ఫాక్టరీని గుజరాత్, లాతూర్ లకు తరలించి తెలంగాణ దశాబ్దాల కలల్ని కాల్చేసింది. బయ్యారం ఉక్కు ఫాక్టరీపై తుక్కు వాదనలు చేస్తూ, నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తూ, ఫ్యాక్టరీ పెట్టడం కుదరదని చావు కబురు చల్లగా చెప్పారు. గిరిజన ప్రజల ఆశల్ని, అవకాశాల్ని ఆవిరి చేశారు. పక్క రాష్ట్రాల ప్రాజెక్టులకు జాతీయ హోదాలు ఇస్తున్న కేంద్రం, పాలమూరు-రంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టులకు హోదా అడిగితే కుదరదని చెప్పి తెలంగాణ రైతాంగంపై పగబట్టినట్టు వ్యవహరిస్తున్నారు.
-రైతు విరోధి మోదీ.. దేశానికే అన్నంపెట్టేలా పంటలు పండిస్తున్న తెలంగాణ రైతాంగాన్ని చూసి కళ్లలో నిప్పులు పోసుకున్న మోదీ సర్కారు, ధాన్యం కొనకుండా కుటిల రాజకీయం చేసింది బీజేపీ. తిండిగింజలు కొనకుండా తొండి వ్యవహారం చేసి, రైతులను ఆగం చేయాలని చూసింది.
-దేశం అప్పుల కుప్ప.. స్వాతంత్ర భారతంలో 67 ఏండ్ల కాలంలో అందరు ప్రధానులు కలిసి చేసిన అప్పు 55.87 లక్షల కోట్ల రూపాయలు. 2014 లో అధికారంలోకి వచ్చిన తరువాత ఈ ఎనిమిదేండ్లలో మోదీ ఒక్కరే చేసిన అప్పు ఎంతో తెలుసా.. 80 లక్షల కోట్ల రూపాయలు.
-రూపాయి పతనం...ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం.. మోడీ అసమర్థ ఆర్థిక విధానాల ఫలితంగా రూపాయి గింగిరాలు తిరిగి పాతాళానికి పడిపోయింది. మారకం విలువ 83 రూపాయలకు చేరి, జీవిత కాల కనిష్ఠానికి దిగజారి ఆర్థిక వ్యవస్థ అతలాకుతమైతున్నది.
-బేచో ఇండియా - క్లియరెన్స్ సేల్.. ప్రభుత్వ రంగాన్ని అంగట్లో వేలానికి పెట్టి, అడ్డికి పావుశేరు చొప్పున అమ్మేస్తున్నది మోడీ సర్కారు. రైళ్లు, విమానాలు, పోర్టులు, ఎల్ఐసీ, బంకులు, నవరత్నాలు, మినీ రత్నాలను తెగనమ్ముకుంటున్నారు.
-కార్పొరేట్లకు కానుకలు - సామాన్యులకు పన్నులు.. పేదలను కొట్టి, పెద్దలకు పెట్టే విధానం అవలంబిస్తున్న బీజేపీ, కార్పొరేట్ టాక్స్ ను ఏకంగా ఒకేసారి 10 శాతం తగ్గించి బడా బాబులకు వరాలిచ్చింది.
-ఆకలి రాజ్యం - తిరోగమనం.. ఎనిమిదేండ్ల మోడీ హయాంలో దేశంలో ఆకలి కేకలు పెరిగాయి. అన్నమో రామచంద్రా అని అలమటించే అభాగ్యుల సంఖ్య పెరిగింది. అంతర్జాతీయ ఆకలి సూచీలో భారత దేశ ర్యాంకు దారుణంగా దిగజారి 107 స్థానానికి పడిపోయింది. బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్థాన్ లాంటి దేశాల కంటే ఘోరంగా మారింది మన స్థితి.