ఆ ప్రధానులు, ముఖ్యమంత్రుల వల్లే కాలేదు... కానీ కేసీఆర్ చేస్తున్నారు..: కేటీఆర్

By Arun Kumar PFirst Published Jun 16, 2021, 2:25 PM IST
Highlights

మంగళవారం సొంత నియోజకవర్గమైన సిరిసిల్లలో పర్యటిస్తున్న కేటీఆర్ డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభించారు. 

సిరిసిల్ల: అవినీతి తావు లేకుండా, ఒక్కపైసా లంచం ఇవ్వాల్సిన అవసరం లేకుండా డబుల్ బెడ్రూం ఇళ్ళ పంపిణీ జరుగుతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇళ్ళ పంపిణీ విషయంలో 5 సార్లు వడపోత కార్యక్రమం చేపట్టి లబ్దిదారులను ఎంపిక చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వాలు పేదలకు కట్టిచ్చిన ఇల్లు పిట్టగూడులా ఉండేవని... మా ప్రభుత్వం సౌకర్యవంతమైన డబుల్ బెడ్రూం ఇళ్లను అందిస్తోందని కేటీఆర్ అన్నారు. 

మంగళవారం సొంత నియోజకవర్గమైన సిరిసిల్లలో పర్యటిస్తున్న కేటీఆర్ డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కేసిఆర్ ప్రభుత్వం పేదవాడి ప్రభుత్వమని అన్నారు. ఇప్పుడు కొంతమంది లబ్దిదారులకు మాత్రమే ఇళ్లు అందివ్వగలిగామని...మిగతావారికి వచ్చే ఏడాది ఇస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. 

''దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75సంవత్సరాలు గడిచినా ఏ ప్రధాని, మరే ముఖ్యమంత్రి చేయని అభివృద్ధి కేసీఆర్ చేస్తున్నారు. గతం లో 29 లక్షల మందికి పెన్షన్లు... ఇప్పుడు 40 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నాం. 4లక్షల మందికి కొత్తగా తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేయాబోతున్నాం. ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా నాలుగున్నర లక్షల మంది బీడీ కార్మికులకు రెండు వేల పెన్షన్ ఇస్తున్నాం'' అని కేటీఆర్ వెల్లడించారు. 

read more  కేసీఆర్ చదివిన ఆ పుస్తకాలే... తెలంగాణ విముక్తిలో ప్రధాన పాత్ర: ఎమ్మెల్సీ కవిత

ఇదే ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మరో మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ... పేదల కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తి సీఎం కెసిఆర్ అన్నారు. ఎవ్వరూ సాహసం చేయని కార్యక్రమాలు సీఎం చేస్తున్నారని... పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం కెసిఆర్ నిర్ణయాలతో ఆశ్చర్యపోతున్నారని పేర్కొన్నారు. 

''కేటీఆర్ సిరిసిల్లకు ఎమ్మెల్యే కావడం ఇక్కడి ప్రజల అదృష్టం. దేశంలోనే నెంబర్ 1 మంత్రి కేటీఆర్. ప్రపంచంలోనే పెద్ద పెద్ద కంపెనీలు మంత్రి కేటీఆర్ చొరవతో హైద్రాబాద్ కు వస్తున్నాయి. 19వేల ఏకరాల్లో ఫార్మా హబ్ ను ఏర్పాటు చేయబోతున్నాం. 5 లక్షల మందికి రానున్న రోజుల్లో ఉద్యోగాలు రాబోతున్నాయి'' అంటూ కేటీఆర్ ను వేముల పొగడ్తలతో ముంచెత్తారు. 
 

click me!