
పట్టణ, పల్లె ప్రగతికి సంబంధించి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ పార్టీలో పది మంది ముఖ్యమంత్రులని ప్రచారం జరుగుతోందని చురకలంటించారు. కర్ణాటకలో గెలిచామని.. తెలంగాణలో కలలు గంటున్నారని ఎద్దేవా చేశారు. విపక్షాలకు కూల్చడం మాత్రమే తెలుసునని తమకు కట్టడం మాత్రమే తెలుసునని అన్నారు. ప్రతిపక్షంలో భట్టి విక్రమార్క వందేళ్లు వుండాలని కోరుకుంటున్నానని కేటీఆర్ సెటైర్లు వేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు విశ్వసనీయత లేదన్నారు. కేంద్రం సహకరించకపోయినా రాష్ట్రాన్ని కేసీఆర్ అభివృద్ధి చేశారని మంత్రి తెలిపారు. పది కాలాలు నిలిచిపోయే పథకాలకే కేసీఆర్ రూపకల్పన చేశారని కేటీఆర్ ప్రశంసించారు. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి కాంగ్రెస్ నేతలకు కనిపించడం లేదని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పాలన ఎంత చెత్తగా వుండేదో రేవంత్ స్వయంగా చెప్పారని కేటీఆర్ గుర్తుచేశారు. తెలంగాణలో కరువు సీమలన్నీ ప్రస్తుతం కోనసీమలుగా మారాయన్నారు. 2022 జనవరి నుంచి భట్టి ఇంట్లో ఒక్క ట్యాంకర్ కూడా బుక్ చేయలేదన్నారు. భట్టి ఇంట్లో మీటర్ చెడిపోవడం వల్లే రూ.2.90 లక్షల నీటి బిల్లు చెల్లించాల్సి వచ్చిందని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు నాయకులే లేరని.. పక్క పార్టీల నుంచి తెచ్చుకున్నారని మంత్రి దుయ్యబట్టారు. రాష్ట్ర బడ్జెట్ అంటే విపక్షాలకు ఖర్చులు, జమాబందీ లెక్కలని కానీ మాతకు మాత్రం జీవనాడి అన్నారు.
ప్రస్తుతం తెలంగాణ రూపురేఖలు మారిపోయాయని కేటీఆర్ పేర్కొన్నారు. పచ్చదనంతో మురిసిపోతున్న పల్లెలకు సినిమా వాళ్లు షూటింగ్‌లకు తరలివస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో 2600 రైతు వేదికలు నిర్మించామని కేటీఆర్ పేర్కొన్నారు. తాను చెప్పేదే తప్పుంటే వచ్చే ఎన్నికల్లో తనను ఓడించాలని మంత్రి సవాల్ విసిరారు. దేశాభివృద్ధికి మౌలిక వసతులు ఎంతో అవసరమని మంత్రి అన్నారు. ఓ వైపు సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే మౌలిక వసతులకు భారీగా కేటాయింపులు చేస్తున్నామని కేటీఆర్ చెప్పారు.
మిషన్ కాకతీయతో వేలాది చెరువుల్ని బాగు చేయించుకున్నామని మంత్రి తెలిపారు. దేశంలోనే ఉత్తమ జిల్లా పరిషత్‌గా ములుగు అవార్డ్ అందుకుందన్నారు. తెలంగాణలో 26 శాతం పెట్టుబడి వ్యయంగా పెడుతున్నామని కేటీఆర్ తెలిపారు. మౌలిక వసతుల కల్పనలో పట్టణాలు, గ్రామాలకు సమాన ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి వెల్లడించారు. పల్లెల్లో హార్వెస్టర్లు, పట్టణాల్లో ఇన్వెస్టర్లు పరుగులు పెడుతున్నారని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో 16 వేల నర్సరీలు ఏర్పాటు చేశామని మంత్రి చెప్పారు. పాలమూరు అంటే ఒకప్పుడు వలసలకు పేరని.. కానీ ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు కూలీలు వస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ పదేళ్ల పాలనలో గ్రామాభివృద్ధికి పెట్టిన మొత్తం ఖర్చు రూ.6,142 కోట్లని మంత్రి అన్నారు. మీటర్ పనిచేసి వుంటే భట్టికి కూడా ఉచిత మంచినీటి పథకం వర్తించేదన్నారు. తాము చేసిన అభివృద్ధిపై కాంగ్రెస్ నేతలకు ఎంత చెప్పినా అర్ధం కాదని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో మానేరు ఒడ్డున కూడా నీళ్లు లేవన్నారు. 9 ఏళ్లుగా తెలంగాణ అభివృద్ధి కోసం నిర్మాణాత్మకంగా పనిచేస్తున్నామని మంత్రి చెప్పారు. దేశంలో 30 శాతం అవార్డులు తెలంగాణ పల్లెలకే వచ్చాయని కేటీఆర్ తెలిపారు.