
అనారోగ్యం తో బాధపడుతూ ఓ సర్పంచ్ ప్రాణాలు కోల్పోయాడు. కాగా... ఆ సర్పంచ్ పాడెను మంత్రి జగదీష్ రెడ్డి మోయడం గమనార్హం. ఈ సంఘటన పెద్దవూరలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
సర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు, పెద్దవూర సర్పంచ్ అంత్యక్రియలు ఆదివారం స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యుల అశ్రునయనాల నడుమ నిర్వహించారు. ఆయన మృతితో పెద్దవూర గ్రామ పంచాయతీలో విషాదఛాయలు అలుముకున్నాయి. హైదరాబాద్‌లో మృతి చెందగా శనివారం రాత్రి 9 గంటలకు పెద్దవూర తీసుకువచ్చిన మృతదేహాన్ని ఆదివారం 11 గంటలకు అంతిమ యాత్ర ప్రారంభమైంది.
తమ అభిమాన నాయకుడి కడచూపు కోసం వందలాదిగా తరలివచ్చారు. కిలోమీటర్ పైగా సాగిన అంతిమ యాత్రలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, జెడ్పీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, ఎంసీ కోటిరెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్‌రెడ్డిలు పాల్గొని నడిచారు.
తన సహచరుడు, సీనియర్ టీఆర్‌ఎస్ నేత, సర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కర్నాటి విజయభాస్కర్‌రెడ్డి అంతిమ యాత్రలో మంత్రి జగదీశ్‌రెడ్డి పాల్గొని పాడెను మోశారు. భాస్కర్‌రెడ్డితో తనకు గల అనుభవాలను గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతం అయ్యారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.