
హైదరాబాద్ గురించి సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన కామెంట్స్‌పై తెలంగాణ మంత్రి హరీష్ రావు స్పందించారు. హైదరాబాద్‌లో ఉన్నానా? న్యూయార్క్‌లో ఉన్నానా? అని ఇక్కడి అభివృద్ది గురించి మాట్లాడారని హరీష్ రావు అన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ది పక్క రాష్ట్రాల రజనీలకు అర్థమవుతుంది కానీ.. ఇక్కడి గజినీలకు అర్థం కావడం లేదని ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలోని కాశీపూర్‌లో బసవ భవన్ నిర్మాణానికి మంత్రి హరీశ్‌రావు శనివారం భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. మనిషికి పని విలువ తెలిపిన మహనీయుడు బసవేశ్వరుడు అని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం బసవేశ్వరుడి జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తుందని చెప్పారు. లింగాయత్ సమాజం ఆత్మగౌరవం పెంచిన వ్యక్తి సీఎం కేసీఆర్ మాత్రమేనని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం బసవేశ్వరుడి భవన్ కోసం కోకాపేట్‌లో రూ. 30 కోట్ల విలువైన భూమి ఇచ్చిందని, దాని నిర్మాణం కోసం రూ. 10 కోట్లు కేటాయించామని తెలిపారు. కాళేశ్వరం నుంచి సంగారెడ్డి జిల్లాకు గోదావరి జలాలు తీసుకొచ్చే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు బసవేశ్వర ప్రాజెక్టు అని పేరు పెట్టామని హరీశ్‌రావు తెలిపారు. లింగాయత్‌లను ఓబీసీలో చేర్చాలని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశామని అన్నారు. లింగాయత్‌లను కేంద్రం వెంటనే ఓబీసీలో చేర్చాలని డిమాండ్ చేశారు.
ఇక, విజయవాడ పోరంకిలోని అనుమోలు గార్డెన్స్ లో నిర్వహించిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు రజనీకాంత్ విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ.. హైదరాబాద్ అభివృద్ది గురించి ప్రస్తావించారు. ఇటీవల హైదరాబాద్‌కు షూటింగ్ కోసం జబ్లీహిల్స్, బంజాహిల్స్ వైపు వెళ్లానని.. దాదాపు 20, 22 ఏళ్ల తర్వాత అటు వెళితే.. ఇండియాలో ఉన్నానా? న్యూయార్క్‌లో ఉన్నానా? అని అనిపించిందని తెలిపారు. హైదరాబాద్ ఆర్థికంగా ఎంత బలంగా ఉందో అందరికి తెలిసిందేనని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇదే విషయం తనతో చెప్పారని అన్నారు.