మునుగోడులో గెలిస్తే రూ. 3 వేలు పెన్షన్ అంటున్నారు.. బీజేపీ హామీలంటేనే జుమ్లా: హరీష్ రావు ఫైర్

Published : Oct 16, 2022, 12:17 PM IST
మునుగోడులో గెలిస్తే రూ. 3 వేలు పెన్షన్ అంటున్నారు.. బీజేపీ హామీలంటేనే జుమ్లా: హరీష్ రావు ఫైర్

సారాంశం

కేంద్రంలో బీజేపీ సర్కార్‌పై తెలంగాణ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశంలో రైతులను మోదీ ప్రభుత్వం అణచివేసిందని విమర్శించారు. టెర్రరిస్టులు, దేశద్రోహులు అంటూ రైతులను అవమానించారని అన్నారు.

కేంద్రంలో బీజేపీ సర్కార్‌పై తెలంగాణ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశంలో రైతులను మోదీ ప్రభుత్వం అణచివేసిందని విమర్శించారు. టెర్రరిస్టులు, దేశద్రోహులు అంటూ రైతులను అవమానించారని అన్నారు. 750 మంది రైతులను పొట్టనబెట్టుకున్నారని మండిపడ్డారు.  మద్దతు ధరకు చట్టబద్దత కల్పిస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఏడాది గడిచిన ఆ హామీని నెరవేర్చలేదని అన్నారు. ప్రధాని మోదీ హామీలకే దిక్కులేకుండా పోయిందన్నారు. 

రాష్ట్రాల్లో ఎన్నిక సందర్భంగా ఇచ్చే హామీలను బీజేపీ ఎక్కడా అమలు చేయడం లేదని విమర్శించారు. మునుగోడులో బీజేపీ గల్లి లీడర్లు నోటికొచ్చిన హామీలు ఇస్తున్నారని విమర్శించారు. దుబ్బాక, హుజూరాబాద్‌లో గెలిస్తే రూ. 3 వేలు పెన్షన్ అన్నారని.. ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు. మరి రూ. 3 వేల పెన్షన్ వచ్చిందా అని అడిగారు. జీహెచ్‌ఎంసీలో ఎన్నో హామీలు ఇచ్చారని అన్నారు. 

ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో రూ. 750 పెన్షన్ ఇస్తున్నారని.. పక్కన ఉన్న కర్ణాటకలో రూ. 600 ఇస్తారని, మహారాష్ట్రలో రూ. 1000 ఇస్తున్నారని.. మునుగోడులో గెలిస్తే మాత్రం రూ. 3 వేల రూపాయలు పించన్ ఇస్తామని చెబితే ఇంతకంటే దగా ఉంటుందా అని ప్రశ్నించారు. దేశంలో ఇంతకంటే మోసం, అబద్దపు మాటలు ఎక్కడైనా చూస్తామా? అని అన్నారు. బీజేపీ నేతలకు దమ్ముంటే వాళ్లు పాలించే రాష్ట్రాల్లో రూ. 3 వేల పెన్షన్ ఇవ్వాలని సవాలు విసిరారు. కన్నతల్లికి అన్నం పెట్టనోడు.. పిన్నతల్లికి బంగారు గాజులు చేయిస్తానని అన్నట్టుగా బీజేపీ తీరు ఉందని విమర్శించారు.

‘‘దేశంలో డయాలసిస్ పెషేంట్లకు రూ. 2,016 ఆసరా పెన్షన్ ఇస్తున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ. 57 ఏళ్లు దాటిన వారికి ఆసరా పెన్షన్ ఇస్తున్న ఒకేఒక రాష్ట్రం తెలంగాణ. దేశంలో 10 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉంటే.. వారికి ఆసరా పెన్షన్ ఇస్తున్న ఒకేఒక రాష్ట్రం తెలంగాణ. దివ్యాంగులకు 3,016 రూపాయలు పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ’’ అని హరీష్ రావు అన్నారు. 

మునుగోడు ప్రజలు అమాయకులు  అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు.  బీజేపీ హామీలంటేనే జుమ్లా అని అన్నారు. బీజేపీ అబద్దాలు దేశప్రజలందరికీ అర్థమైపోయాయని విమర్శించారు. భాద్యత లేకుండా బీజేపీ నేతలు ఏదైనా మాట్లాడుతారని మండిపడ్డారు.  బీజేపీ వాగ్దానాలకు ప్రజలు పట్టించుకోరని అన్నారు. మునుగోడు ప్రజలు చైతన్యవంతులని అన్నారు. టీఆర్ఎస్ గెలుపుతోనే మునుగోడు అభివృద్ది అని అన్నారు.  
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Rain Alert : ఈ ఐదు జిల్లాలకు పొంచివున్న పిడుగుల గండం... తస్మాత్ జాగ్రత్త
IndiGo Airlines Hyderabad: ఇండిగో విమానాలు ఆలస్యం.. ఎయిర్‌పోర్ట్‌లో గందరగోళం | Asianet News Telugu