సీబీఐ పేరుతో జైలు అధికారినే మోసం చేశారు సైబర్ నేరగాళ్లు. నగ్న వీడియోలున్నాయంటూ బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజారు.
హైదరాబాద్ : సైబర్ నేరగాళ్లు ఏకంగా జైలు ఉన్నతాధికారినే మోసం చేశారు. నగ్న వీడియోల బూచి చూపించి రూ.97,500 దోచేశారు. యూట్యూబ్ లో మీ నగ్న వీడియో వైరల్ అవుతోంది అంటూ.. సిబిఐ పేరుతో ఈ డబ్బు వసూలు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చర్లపల్లి జైలు డిప్యూటీ సూపరింటిండెంట్ సిహెచ్ దశరథంతో యువతుల పేరుతో ఇటీవల కొందరు చాటింగ్ చేశారు. నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడారు.
దాన్ని రికార్డు చేసిన మాయగాళ్లు సామాజిక మాధ్యమాల్లో పెడతామంటూ బెదిరింపులకు దిగారు. సదరు అధికారి ఆ బెదిరింపులను పట్టించుకోకపోవడంతో సీబీఐ అధికారి అజయ్ కుమార్ పాండే పేరుతో నిందితుడు ఫోన్ చేశారు. మీ అసభ్య వీడియోపై యూట్యూబ్ నుంచి ఫిర్యాదు అందిందని తనకు డబ్బు చెల్లిస్తే తదుపరి చర్యలు తీసుకోమని నమ్మించాడు. సిబిఐ పేరుతో నకిలీ లేఖ కూడా పంపాడు. రాహుల్ శర్మ అనే వ్యక్తి నెంబర్ కి కాల్ చేయాలని సూచించాడు. బాధితుడు అతడికి ఫోన్ చేయగా వీడియోలు తొలగించేందుకు డబ్బులు కావాలన్నాడు.
మా నాయకుల అరెస్టు దురదృష్టకరం.. వెంటనే విడుదల చేయాలి. లేదంటే నేనే స్టేషన్ కు వస్తా.. పవన్ కల్యాణ్..
దీనికోసం రెండు విడతల్లో రూ.97,500 బదిలీ చేశాడు. ఆ తర్వాత తమ దగ్గర మరో రెండు వీడియోలు ఉన్నాయని వాటిని వైరల్ చేయకుండా ఉండాలంటే రూ.85వేలు పంపాలని బెదిరించాడు. దీంతో కంగారుపడుతున్న దశరథంను తోటి అధికారి గమనించి వివరాలు తెలుసుకున్నాడు. ఇది సైబర్ నేరగాళ్ల పనై ఉంటుందని.. చెప్పడంతో బాధితులు కుషాయిగూడ పోలీసుల్ని ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్ నుంచి మోసానికి పాల్పడినట్టు గుర్తించారు.