నిరుద్యోగులకు శుభవార్త... త్వరలో భారీ ఉద్యోగాల భర్తీ: మంత్రి హరీష్

By Arun Kumar PFirst Published Jan 5, 2021, 3:28 PM IST
Highlights

ఇవాళ(మంగళవారం) తెలంగాణ భవన్ లో ప్రయివేటు ఉద్యోగుల సంఘం డైరీని మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు. 

హైదరాబాద్: భారత దేశంలోనే అతి తక్కువ నిరుద్యోగం ఉన్న మూడు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని ఆర్థిక మంత్రి హరీష్ రావు తెలిపారు. దేశ‌ నిరుద్యోగ రేటు కంటే తెలంగాణ లో నిరుద్యోగ రేటు తక్కువన్నారు. ఈ నెలాఖరులో ఉద్యోగులకు ప్రమోషన్లు ఇచ్చి ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని... మొత్తంగా యాభై వేల ఉద్యోగాల భర్తీకి‌ టీఆర్ఎస్ ప్రభుత్వం సిద్దమయ్యిందన్నారు. అంతేకాకుండా ప్రయివేటు కంపెనీల్లో భారీగా ఉద్యోగాల కల్పన జరుగుతోందని మంత్రి వెల్లడించారు.

ఇవాళ(మంగళవారం) తెలంగాణ భవన్ లో ప్రయివేటు ఉద్యోగుల సంఘం డైరీని మంత్రి ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమంలో పుట్టిన సంఘం ఇదని గుర్తుచేశారు. ప్రయివేటు సంస్థల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆనాడు గంధం రాములు తెరాసకు అనుబంధంగా ఈ సంస్థ ను ప్రారంభించారన్నారు.  ఆనాడు తెలంగాణ కోసం కోట్లాడిన సంఘం నేడు....ఉద్యోగుల సంక్షేమం కోసం పాటుపడుతోందని అన్నారు.

''ఆనాడు జనవరి నెలంతా జరిగే డైరీ ఆవిష్కరణలన్నీ ఉద్యమ కేంద్రాలు. తూటాల్లాంటి మాటలు ఈ ఆవిష్కరణ సభల్లో వచ్చేవి. ఉద్యమ భావ వ్యాప్తి బాగా జరిగేది.ఆనాడు మీరు చేసిన ఉద్యమం మేం ఎన్నటికీ మరిచిపోం. సాగరహారం, మిలియన్ మార్చ్ లో తూటాలకు, బాష్ప వాయు గోలాలకు ఎదురు నిలిచి పోరాడారు. చివరకు సీఎం కేసీఆర్ నిరహార దీక్షతో తెలంగాణ సాకారమయింది'' అని పేర్కొన్నారు.

''సీఎం కేసీఆర్ పరిపాలన, విద్యుత్, తాగు నీరు, రక్షణ వల్ల హైదరాబాద్ కు పరిశ్రమలు తరలి వస్తున్నాయి. జాతీయ అంతర్జాతీయ కంపెనీలు తెలంగాణ లో పెట్టడానికి ముందుకు వస్తున్నారు. కాబట్టి ఈ సంఘం ఉద్యోగ మేళాలు, స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి'' అని మంత్రి సూచించారు.

''2008 లో ఆనాడు ఉద్యమంలో కలిసి మీతో పని చేశా...ఆ ప్రేమను మర్చిపోను. ఆనాడు మాతో పాటు మీరు జైలు బాట పట్టారు. ఈ నూతన సంవత్సరం మీ జీవితాల్లో వెలుగులు నిండాలి'' అని మంత్రి హరీష్ రావు కోరుకున్నారు. 

click me!