బీఆర్ఎస్‌లో వుండి ఎమ్మెల్సీలుగా కాకూడదా.. యూపీకో న్యాయం, మాకో న్యాయమా : తమిళిసై హరీశ్ రావు ఆగ్రహం

By Siva Kodati  |  First Published Oct 5, 2023, 8:53 PM IST

గవర్నర్ కోటా కింద తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఎమ్మెల్సీ అభ్యర్ధులను గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ తిరస్కరించడంపై ఫైర్ అయ్యారు మంత్రి హరీశ్ రావు. గవర్నర్ వ్యవస్థను అడ్డు పెట్టుకుని బీజేపీ దేశంలో నీచ రాజకీయాలు చేస్తోందని హరీశ్ రావు ఫైర్ అయ్యారు.


గవర్నర్ కోటా కింద తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఎమ్మెల్సీ అభ్యర్ధులను గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ తిరస్కరించడంతో రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. బీఆర్ఎస్ నేతలు గవర్నర్ తీరుపై మండిపడుతున్నాయి. తాజాగా మంత్రి హరీశ్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎరుకల జాతిలో ఒకరికి, విశ్వ బ్రాహ్మణ కులంలో మరొకరికి ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించామని.. కానీ గవర్నర్ తిరస్కరించారని ఆవేదన వ్యక్తం చేశారు. 

గవర్నర్ వ్యవస్థను అడ్డు పెట్టుకుని బీజేపీ దేశంలో నీచ రాజకీయాలు చేస్తోందని హరీశ్ రావు ఫైర్ అయ్యారు. విశ్వ బ్రాహ్మణులు, ఎరుకలు బీజేపీకి గుణపాఠం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బీఆర్ఎస్‌లో వుండి ఎమ్మెల్సీగా ఎన్నికైతే తప్పా.. తమది ఏమైనా నిషేధిత పార్టీనా అని గవర్నర్‌ను ప్రశ్నించారు. యూపీలో బీజేపీ వాళ్లకే నామినేటెడ్ పదవులు కట్టబెట్టారని.. ఆ రాష్ట్రానికో నీతి, తెలంగాణకు మరో నీతా అని హరీశ్ రావు నిలదీశారు. ఏ పార్టీ అయినా ఇప్పటి వరకు ఎరుకల కులానికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చిందా.. దీని గురించి ఆలోచించిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అని మంత్రి ప్రశంసించారు. 

Latest Videos

ALso Read: గులాబీ పార్టీ ఏ పార్టీకి గులాంగిరి చేయదు.. ప్రధాని మోడీపై మంత్రి కేటీఆర్ ఫైర్

అంతకుముందు నిన్న నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో హరీశ్ రావు మాట్లాడుతూ.. ప్రతిపక్ష కాంగ్రెస్ పై విమర్శలు గుప్పిస్తూ.. ఆరు గ్యారెంటీలు అంటున్నతెలంగాణ ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. పక్కనే ఉన్న కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ  ఇచ్చిన హామీలు అమలు చేయలేక బోర్లా పడిందని ఏద్దేవా చేశారు. అధికారంలో ఉన్న రాష్ట్రంలోనే అమలు చేయలేని హామీలను తెలంగాణలో అమలు చేస్తామంటే ఎవరూ నమ్మతారని మండిపడ్డారు.  తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళు కాదని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేసిన దాఖలాలు లేవన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది చేస్తుందని.. చేసేదే చెబుతుందని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.

మరోవైపు ప్రధాని మోడీని టార్గెట్ చేస్తూ.. విమర్శలు గుప్పించారు. ప్రధాని మోడీ పార్లమెంటులో కేసీఆర్ ను పోగడడం తెలంగాణలో అడుగుపెట్టగానే తిట్టడం ఆయనకు అలవాటుగా మారిందని అన్నారు. 24 గంటల ఉచిత కరెంటు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, కానీ బీజేపీ అధికారంలోకి వస్తే మోటార్ కు మీటర్, ఇంటికి బిల్లు తప్పదని హెచ్చరించారు. మీటర్లు కావాలో..? బిల్లు కావాలో..?  ఎరువుల కోసం రోడ్లు ఎక్కే పరిస్థితి కావాలో? 24 గంటల ఉచిత కరెంటు కావాలో? ప్రజలే ఆలోచించుకోవాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు 24 గంటల ఉచిత కరెంటు, రైతు బంధు, రైతు బీమా ఇస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని మంత్రి హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. 
 

click me!