రైతుల కోసమైతే హైదరాబాద్ లో కాదు... అక్కడ దీక్ష చేయాలి: బండి సంజయ్ పై గంగుల ఫైర్

By Arun Kumar PFirst Published Apr 24, 2020, 8:13 PM IST
Highlights

రైతుల సమస్యల పరిష్కారం కోసం ఎంపీ బండి సంజయ్ హైదరాబాద్ లో కాకుండా ఎఫ్‌సిఐ ముందు దీక్ష చేపట్టాలని మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. 

కరీంనగర్: సిరిసిల్ల జిల్లాలో నిన్న(గురువారం) రైతులు చేపట్టిన ఆందోళన బాధాకరమని పౌరసరఫరా శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. పాడిని, పంటని రైతులు దైవంలా భావిస్తారని...అలాంటి ధాన్యాన్ని తగలబెట్టొద్దని రైతన్నలకు మంత్రి విజ్ఞప్తి చేశారు. దేశంలో ఏ రాష్ట్రములో లేని విధంగా తెలంగాణలోనే ప్రతి గింజ కొంటామని ప్రకటించామని... సమైక్య రాష్ట్రంలో కుండా ఇంతగా కొనుగోళ్ల సెంటర్లు ఏర్పాటు చేయలేదని తెలిపారు. 

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై మంత్రి గంగుల కమలాకర్ ఫైర్ అయ్యారు. అసలు ప్రోక్యుమెంట్ ఎవరు చేస్తారో బండి సంజయ్ కి అవగాహనా ఉందా? అని ప్రశ్నించారు. కేంద్రానికి సంబంధించిన ఎఫ్‌సిఐ ప్రోక్యుమెంట్ చేస్తుంటే ఎంపీగా ఉండి సంజయ్ హైదరాబాద్ లో దీక్షకి దిగారని ఎద్దేవా చేశారు. ఇదేదో ఢిల్లీలోని ఎఫ్‌సిఐ దగ్గర కూర్చుండి రైతుల సమస్యపై మాట్లాడండి...సంతోషిస్తాం అని సంజయ్ కి సూచించారు మంత్రి గంగుల. 

రైతులకి అభద్రత కల్పించేలా రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదని అన్నారు. సంజయ్ ఎఫ్‌సిఐ ముందు దీక్ష చేస్తే రైతులకి న్యాయం జరుగుతుంది...అక్కడకి వెళ్లి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు సెంటర్లలో 99 శాతం తాలు, తరుగు తీయకుండానే కొంటున్నామని మంత్రి తెలిపారు. 
  
ఇప్పటిదాకా 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఇలా లక్షా 67 వేల మంది రైతుల పంట కొనుగోలు చేశామన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వరి పంటకి అగ్గి తెగులు రావడంతో రావాల్సిన దాని కంటే తాలు ఎక్కువగా ఉందన్నారు. కొనుగోలు సెంటర్లలో రైస్ మిల్లర్లతో సమస్య ఉంటె అధికారుల దృష్టి కి తీసుకురావాలి.... అంతేకాని పంట తగలబెట్టకండి అని రైతులకు మంత్రి సూచించారు.

రైతులకు రైస్ మిల్లర్లతో సమస్య ఉంటే ప్రభుత్వ కొనుగోలు సెంటర్లకి రావాలన్నారు. ఈ విషయంలో రైతులకు అధికారులు పరిష్కారం చూపిస్తారు. అంతేకానీ  పంటను పాడుచేసుకుని నష్టపోవద్దని రైతులను కోరారు మంత్రి గంగుల కమలాకర్. 

 

click me!