పొలిటికల్ రివ్యూ: ఈటల కలకలం,రేవంత్ సంచలనం

By narsimha lodeFirst Published Sep 1, 2019, 10:20 AM IST
Highlights

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. టీఆర్ఎస్‌లో అంతర్గతంగా ఏదో జరుగుతోందనే వాదనలనకు ఊతం చేకూరేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. టీఆర్ఎస్‌లో అంతర్గతంగా ఏదో జరుగుతోందనే వాదనలనకు ఊతం చేకూరేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

ఈటల రాజేందర్ కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ కౌంటర్ ఇచ్చారు. ఈ పరిణామాలన్నీ కూడ టీఆర్ఎస్ వర్గాలను గందరగోళంలోకి నెట్టాయి. విద్యుత్ కొనుగోళ్ల విషయంలో ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావుపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. గత వారం తెలంగాణ రాష్ట్రంలో ఈ పరిణామాలపైనే హట్ హాట్ గా చర్చలు సాగాయి.

కొత్త రెవిన్యూ చట్టం తయారీకి సంబంధించి కలెక్టర్ల సమావేశంలో సీఎం కేసీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యల వివరాలను బయటకు పొక్కకుండా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ సమావేశం జరిగిన తర్వాత రెవిన్యూ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి ఈటల రాజేందర్ తో సమావేశమయ్యారు.

రెవిన్యూ అసోసియేషన్ ప్రతినిధులకు ఈ సమాచారాన్ని ఈటల రాజేందర్ చేరవేశారని సీఎం కేసీఆర్ ఆగ్రహంగా ఉన్నాడని టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారంలో ఉంది.ఈ కారణంగానే ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుండి తప్పిస్తారని ప్రచారం సాగుతోంది. ఈటల రాజేందర్ మాత్రం ఈ రకమైన ప్రచారాన్ని ఖండిస్తున్నారు.

ఈ ప్రచారంపై ఎవరూ కూడ స్పందించకూడదని మంత్రి ఈటల రాజేందర్ పార్టీ శ్రేణులకు సూచించారు. కానీ, ఆ తర్వాతే ఆయనే ఈ విషయమై తన మనసులోని బాధను బయటపెట్టారు. పార్టీలో చోటు చేసుకొన్న పరిణామాలను ఆయన బయటపెట్టారు.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో తనను ఓడించేందుకు ప్రయత్నించారనే విషయాన్ని ఆయన హూజూరాబాద్ లో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో కుండబద్దలు కొట్టారు. ఎవరు తనను ఓడించేందుకు డబ్బులు పంచారో సమయం వచ్చినప్పుడు బయటపెడతానని ప్రకటించారు.

మంత్రి పదవి తనకు బిక్ష కాదని తేల్చి చెప్పారు. బీసీ కోటాలో తాను మంత్రి పదవిని అడగలేదన్నారు. తాను ఇల్లు కట్టుకొంటే ఎందుకు కక్ష కట్టారని ఆయన ప్రశ్నించారు. గులాబీ జెండాకు తామే ఓనర్లమని ఆయన తేల్చి చెప్పారు. 

ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. ఈ పరిణామం టీఆర్ఎస్ ను కుదుపుకు గురిచేసింది. వెంటనే టీఆర్ఎస్ నాయకత్వం రంగంలోకి దిగింది. ఈటల రాజేందర్ తో సంప్రదింపులు జరిపింది.

ఈ పరిణామంతో ఈటల రాజేందర్ మరో ప్రకటనను విడుదల చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధిస్తోందని ప్రకటించారు. కేసీఆరే తమ నాయకుడని ఆయన ప్రకటించారు.

మంత్రివర్గాన్ని విస్తరించేందుకు కేసీఆర్ సన్నాహలు చేస్తున్నారని  ఈ ధఫా కేటీఆర్ కు మంత్రి పదవి లభించే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.ఈ తరుణంలోనే ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుండి తప్పిస్తారనే ప్రచారం కూడ లేకపోలేదు. హరీష్ రావుకు ఈ దఫా మంత్రివర్గంలో చోటు విషయమై స్పష్టత లేదు.

ఈటల రాజేందర్ ఈ వ్యాఖ్యలు చేసిన మరునాడు బీసీ సంఘాల నేతలు ఆయనతో భేటీ అయ్యారు.ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక చోటు చేసుకొన్న పరిణామాలను ఆయన వివరించారు.ఈటల వ్యాఖ్యలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కౌంటరిచ్చారు. గులాబీ జెండాకు కేసీఆర్ ఓనర్ అంటూ ఈటలకు కౌంటరిచ్చారు. 

ఈటల రాజేందర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్, బీజేపీ నేతలు కూడ స్పందించారు. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలపై స్పందించారు. ఈటల రాజేందర్ వ్యాఖ్యలు చూస్తే టీఆర్ఎస్ లో భూకంపం వస్తోందనుకొన్నా.. కానీ, కేటీఆర్ ఫోన్ చేయగాను తుస్సుమన్నారని ఆయన సెటైర్లు వేశారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కూడ ఈటల రాజేందర్ ను మరో ఉద్యమానికి నాంది పలకాలని కోరారు.

విద్యుత్ కొనుగోళ్లపై రేవంత్ వ్యాఖ్యల కలకలం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్ల విషయమై ఎంపీ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వంతో దీర్ఘకాల ఒప్పందం వెనుక అదానీ గ్రూప్ ఉందని ఆయన ఆరోపించారు. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంపై ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావు తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆయన మండిపడ్డారు.

ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావును గన్ పార్క్ వద్ద నిలబెట్టి కాల్చినా తప్పు లేదని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యలపై విద్యుత్ ఉద్యోగులు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని కోరుతూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

విద్యుత్ కొనుగోళ్ల విషయమై రేవంత్ రెడ్డి కంటే ముందే బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు లక్ష్మణ్ కూడ తీవ్ర ఆరోపణలు చేశారు. సీబీఐ విచారణకు కూడ డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలకు సీఎండీ ప్రభాకర్ రావు కూడ స్పందించారు. ఏ విచారణకైనా సిద్దమేనని చెప్పారు.

విద్యుత్ విషయంలో లక్ష్మణ్ కు తాను సమాచారం పంపుతానని కూడ రేవంత్ రెడ్డి చెప్పారు. అయితే తన వద్ద సమాచారం ఉందని లక్ష్మణ్ రేవంత్ కు కౌంటరిచ్చారు.కేసీఆర్ వ్యతిరేకులకు బీజేపీలో స్థానం లేదని రేవంత్ రెడ్డి బీజేపీ నాయకత్వంపై స్పందించారు.

ఏపీ, తెలంగాణ మథ్య ఒప్పందాలు

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులను తెలంగాణ సీఎం కేసీఆర్ గత వారంలో పరిశీలించారు.ఈ ప్రాజెక్టు పరిధిలోని రిజర్వాయర్లను పరిశీలించే సమయంలో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

గోదావరి నదీ జలాలను కృష్ణాకు మళ్లించే విషయంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య ఒప్పందాలు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాల మద్య ఈ విషయమై ఇప్పటికే చర్చలు జరిగినట్టుగా ఆయన తెలిపారు. 

ఈ విషయమై ఏపీ ప్రభుత్వంతో చర్చించిన మీదట  ఆ రాష్ట్రంతో ఒప్పందాలు చేసుకొంటామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.మరో వైపు ఈ నదీ జలాల మళ్లింపు విషయంలో చంద్రబాబు నాయుడు గతంలో చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. బాబుపై విమర్శలు గుప్పించారు.

తాను అధికారంలో ఉన్న సమయంలో చేయకపోగా ఇప్పుడు ఎవరూ కూడ చేయకూడదనే రీతిలో చంద్రబాబునాయుడు వ్యవహరిస్తున్నాడని ఆయన మండిపడ్డారు. ఇక ప్రాజెక్టులు నిర్మించకుండా కాంగ్రెస్ నేతలు కేసులు వేశారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

click me!