లాక్ డౌన్ వేళ ఆటవిడుపు: మనవరాలితో టెన్నిస్ ఆడిన ఎర్రబెల్లి

By telugu teamFirst Published Apr 25, 2020, 1:25 PM IST
Highlights

కరోనా వ్యాప్తిని అరికట్టడానికి లాక్ డౌన్ అమలవుతున్న వేళ తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆటవిడుపుగా తన మనవరాలితో టేబుల్ టెన్నిస్ ఆడారు. తాను ఆటను ఆస్వాదించినట్లు తెలిపారు.

హైదరాబాద్:ఎప్పుడూ ప్రభుత్వ పథకాలు, వాటి రూప కల్పన, అమలు - ప్రజలు, ప్రజాసేవ వంటి కార్యక్రమాల తో బిజీ బిజీగా ఉండే రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కరోనా వైరస్ విస్తృతి లాక్ డౌన్ సమయంలో ఆట విడుపు ప్రదర్శించారు. హైదరాబాద్ లోని తన ఇంట్లో మనుమరాలు తన్వి తో టేబుల్ టెన్నిస్ అడారు. 

ఎప్పుడూ ప్రజా మీటింగుల్లో మైకులు పట్టుకునే చేతిలోకి టేబుల్ టెన్నిస్ బ్యాట్ వచ్చింది. నిన్న మొన్నటి దాకా కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తూ, పాలకుర్తి సొంత నియోజకవర్గంలో ప్రజలను జాగృత పరుస్తూ, భరోసానిస్తూ, మాస్కులు, శానిటైజర్లు పంచుతూ, పలు స్వచ్ఛంద సేవా సంస్థలు, తన ఎర్రబెల్లి ట్రస్టు ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంచుతూ, బిజీగా గడుపుతున్నారు. 

పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ వచ్చిన మంత్రి తన కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. ఇందులో భాగంగా శనివారం తన మనుమరాలు తన్వి తో కలిసి టేబుల్ టెన్నిస్ ఆడారు. వాగ్బాణాలతో గడిచే, నడిచే రాజకీయాలకు అతీతంగా సాగిన ఆటలో ఉండే మజాను ఆస్వాదిస్తూ, క్రీడా స్ఫూర్తి ని చాటారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... లాక్ డౌన్లో సమయం చిక్కినప్పుడల్లా, కుటుంబ సభ్యులతో గడుపుతున్నానని,  కాలక్షేపం కోసం మనమరాలితో టేబుల్ టెన్నిస్ ఆడుతున్నానని అన్నారు. కుటుంబ జీవనాన్ని ఆస్వాదిస్తున్నానని చెప్పారు.

ప్రజలు లాక్ డౌన్ ని పకడ్బందీగా పాటించాలని ప్రజలకు సూచిస్తూ, తానూ స్వీయ నియంత్రణ పాటిస్తున్నానని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. ప్రజలు ఇళ్లలోనే ఉండి కరోనా నియంత్రణలో ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు విజ్ఞప్తి చేశారు. 

click me!