తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. విలువైన పత్రాలను చించారని మల్లారెడ్డిపై కేసు నమోదైంది. ల్యాప్ టాప్ ఇంకా బోయినపల్లి పోలీస్ స్టేషన్ లోనే ఉంది.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐటీ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు .ల్యాప్ టాప్ లాక్కొన్నారని, విలువైన పత్రాలు చించేశారని పోలీసులకు ఐటీ అధికారి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. మరోవైపు ఐటీ అధికారికి చెందిన ల్యాప్ టాప్ ను బోయినపల్లి పోలీస్ స్టేషన్ లో మంత్రి మల్లారెడ్డి అనుచరులు అప్పగించారు. కానీ ఈ ల్యాప్ టాప్ ను అధికారులు తీసుకెళ్లలేదు.దీంతో బోయినపల్లి పోలీసుల వద్దే ఈ ల్యాప్ టాప్ ఉంది.
తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి నివాసంలో రెండు రోజుల పాటు ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. నిన్న ఉదయమే సోదాలు ముగిశాయి. బుధవారంనాడు రాత్రి ఐటీ సోదాల సమయంలో హైడ్రామా చోటు చేసుకుంది. మంత్రి మల్లారెడ్డి తనయుడు మహేందర్ రెడ్డితో స్టేట్ మెంట్ పై ఐటీ అధికారులు సంతకాలు చేయించారని సమాచారం తెలుసుకున్న మంత్రి మల్లారెడ్డి సూరారంలోని నాారాయణ హృదయాలయానికి చేరుకున్నారు.మహేందర్ రెడ్డి నుండి తీసుకున్న స్టేట్ మెంట్ ను ఐటీ అధికారి బోయినపల్లికి తరలించినట్టుగా ఐటీ అధికారి తెలిపారు.
also read:మంత్రి మల్లారెడ్డి ఫిర్యాదు: తెలంగాణ హైకోర్టులో ఐటీశాఖ లంచ్ మోషన్ పిటిషన్
దీంతో అతడిని తీసుకొని తాను బోయినపల్లికి చేరుకున్నానని మంత్రి మల్లారెడ్డి చెప్పారు. మెడికల్ కాలేజీల్లో డొనేషన్ల ద్వారా రూ. 100 కోట్లు తీసుకున్నట్టుగా స్టేట్ మెంట్ తయారు చేసి తన కొడుకుతో సంతకం చేయించారని మల్లారెడ్డి ఆరోపించారు.ఈ విషయమై మంత్రి మల్లారెడ్డి ఐటీ అధికారిని బోయినపల్లి పోలీసులకు అప్పగించారు. ఈ సమయంలోనే సీఆర్‌పీఎప్ సిబ్బంది ఈ స్టేషన్ ను తాళం వేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ అధికారికి చెందిన ల్యాప్ టాప్ ను మల్లారెడ్డి అనుచరులు తీసుకెళ్లారని ఆరోపించింది. అంతేకాదు విలువైన పత్రాలను చించేశారని కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదులపై మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు.