టార్గెట్ ఆర్మీ.. వయా హైదరాబాద్: నల్లకుంటలో ఐఎస్ఐ టెలిఫోన్ ఎక్స్చేంజ్

By sivanagaprasad kodatiFirst Published Dec 29, 2018, 12:13 PM IST
Highlights

జమ్మూ కశ్మీర్‌తో పాటు సరిహద్దుల్లో మోహరించి ఉన్న రక్షణ దళాల రహస్యాలను సంపాదించడానికి పాకిస్తాన్ గూఢచార సంస్థ (ఐఎస్ఐ) పన్నిన వ్యూహాన్ని తెలంగాణ పోలీసులు రట్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని ఓ ప్రాంతం నుంచి పాకిస్తాన్‌కు భారీగా కాల్స్ వెళుతున్నాయని అలాగే కశ్మీర్‌లోని సైనిక స్థావరానికి రక్షణ శాఖ అధికారులమని కొన్ని ఫోన్లు వస్తున్నాయి. 

జమ్మూ కశ్మీర్‌తో పాటు సరిహద్దుల్లో మోహరించి ఉన్న రక్షణ దళాల రహస్యాలను సంపాదించడానికి పాకిస్తాన్ గూఢచార సంస్థ (ఐఎస్ఐ) పన్నిన వ్యూహాన్ని తెలంగాణ పోలీసులు రట్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని ఓ ప్రాంతం నుంచి పాకిస్తాన్‌కు భారీగా కాల్స్ వెళుతున్నాయని అలాగే కశ్మీర్‌లోని సైనిక స్థావరానికి రక్షణ శాఖ అధికారులమని కొన్ని ఫోన్లు వస్తున్నాయి.

ఈ విషయాన్ని పసిగట్టిన మిలటరీ నిఘా వర్గాలు కొద్దిరోజుల కిందట తెలంగాణ పోలీసులకు సమాచారం అందించాయి. ఆర్మీ ఇచ్చిన సమాచారం మేరకు తెలంగాణ పోలీసులు రంగంలోకి దిగారు. రహస్యంగా పరిశోధించి నల్లకుంట టీఆర్‌టీ కాలనీలో నివసిస్తున్న దినేశ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

ఇతను తన ఇంట్లోనే అక్రమంగా టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఏర్పాటు చేసి దాని ద్వారా పాకిస్తాన్‌కు, కశ్మీర్‌లోని సైన్యాధికారులకు మధ్య ఫోన్లు చేయిస్తున్నాడని అనుమానిస్తున్నారు. అతని వద్ద ల్యాప్‌టాప్‌లు, పదుల సంఖ్యలో సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నారు.

దినేశ్ మూడేళ్ల కింద ఇంటర్నెట్ కేంద్రం ప్రారంభించాడు. అయితే వ్యాపారంలో నష్టాలు రావడంతో దానిని మూసివేశాడు. ఆ తర్వాత ఏడు నెలల క్రితం తన ఇంట్లోనే వీవోఐపీ ఎక్స్చేంజ్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. తద్వారా ఇక్కడి నుంచే దుబాయ్ సహా ఇతర దేశాలకు చౌకధరలో ఫోన్ చేసుకోవచ్చని ప్రచారం చేశాడు.

అలాగే డబ్బు తీసుకుని చాలామందికి ఈ అవకాశం కల్పించాడు కూడా. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లు కొద్దినెలల కిందట దినేశ్‌ను సంప్రదించినట్లుగా తెలుస్తోంది. వీరు తమను తాము భారత సైన్యంలో ఉన్నతాధికారులమని చెప్పి... కశ్మీర్‌లోని సైనికాధికారుల నుంచి అత్యంత సున్నితమైన రహస్య సమాచారాన్ని కోరేవారు.

అయితే పదే పదే ఇలాంటి ఫోన్లు రావడంతో అధికారులకు ఈ వ్యవహారంపై అనుమానం వచ్చి వెంటనే మిలటరీ నిఘా విభాగానికి సమాచారం అందించారు. ఆ తర్వాత అప్రమత్తమైన సైన్యం ఫోన్ల ద్వారా ఎటువంటి సమాచార మార్పిడి చేయరాదంటూ ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత ఈ ఫోన్లు హైదరాబాద్‌లోని ఓ ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ నుంచి వస్తున్నాయని గుర్తించి, ఎన్ఐఏ ద్వారా తెలంగాణ పోలీసులకు సమాచారం అందించారు. 

వీవోఐపీ టెక్నాలజీ అంటే:
వీవోఐపీ ద్వారా మన నెంబర్ గోప్యంగా ఉంచుతూనే విదేశాలకు ఫోన్ చేయవచ్చు.  ఇతర దేశాల నుంచి వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెక్నాలజీతో చేసే కాల్స్ ఈ ఎక్స్చేంజ్‌లో ల్యాండ్ అవుతాయి.

ఆ తర్వాత ఇవి సాధారణ టెలికాం కాల్స్‌గా మారిపోతాయి. సిమ్ బాక్స్‌గా పిలిచే చిన్న మోడెంలాంటి పరికరం ఈ పనిని నిర్వర్తిస్తుంది. ఈ టెక్నాలజీతో చేసే ఫోన్ కాల్ ఏ దేశం నుంచి వస్తోంది తెలియదు. 
 

click me!