
తెలుగు రాష్ట్రాల్లో మధ్యంతర ఉప ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. శాసనసభ్యల ఫిరాయింపు వ్యవహారం వివాదాస్పదమవటమే ఇందుకు కారణం. అధికారంలో ఉన్న తెలంగాణా రాష్ట్ర సమితి గానీ తెలుగుదేశం పార్టీ గాని అత్యుత్సాహం చూపి ప్రతిపక్షాల్లోని ఎంఎల్ఏలను ఫిరాయింపులకు ప్రోత్సహించటంతో పెద్ద వివాదమే రేగుతోంది. ఇదే విషయమై ఇరు రాష్ట్రాల్లోనూ విపక్షాలకు చెందిన పలువురు న్యాయస్ధానం మెట్లెక్కారు.
తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ ఎంఎల్ఏ సంపత్ సుప్రింకోర్టులో దాఖలు చేసిన పిటీషన్ను సుప్రింకోర్టు విచారణకు స్వీకరించిన వియం అందరికీ తెలిసిందే. పిటీషనర్ వాదనలు విన్న తర్వాత సుప్రింకోర్టు తెలంగాణా శాసనసభాపతి మదుసూధనాచారికి నోటీసులు జారీ చేయటం విశేషం. ఫిరాయింపు ఎంఎల్ఏలపై అనర్హత విషయమై నిర్ణయం తీసుకునేందుకు ఎంత సమయం కావాలని స్పీకర్ ను నిలదీసింది. నాలుగు వారాల్లోగా సమాధానం చెప్పాలంటూ నోటీసుల్లో స్పష్టం చేసింది. దాంతో అధికారపార్టీలోనూ, స్పీకర్ కార్యాలయంలోనూ హడావుడి మొదలైంది.
సుప్రింకోర్టు ఇచ్చిన నాలుగు వారాల గడువు కూడా దగ్గరకు వచ్చేస్తుండటంతో ఏమి సమాధానం చెప్పాలన్నవిషయమై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ నేపధ్యంలోనే ఫిరాయింపు శాసనసభ్యులందరితోనూ రాజీనామాలు చేయిస్తే ఎలాగుంటుందన్న చర్చ కూడా ముఖ్యమంత్రి మదిలో మొదలైనట్లు సమాచారం. వారిపై అనర్హత వేటు పడకముందే ఆ పనిచేయిస్తే బాగుంటుందని కెసిఆర్ కు పలువురు సలహా ఇస్తున్నారు. అందులోనూ రాష్ట్రంలోని రాజకీయ పరిస్ధితులు ముఖ్యమంత్రి యోచనకు సానుకూలంగా ఉన్నట్లు టిఆర్ఎస్ భావిస్తోంది.
ప్రస్తుతం అధికార పార్టీకి తిరుగులేదని కాబట్టి ఫిరాయింపు ఎంఎల్ఏలందరితోనూ రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళితే అఖండ మెజారిటీతో మళ్ళీ గెలిపించుకోవచ్చని కొందరు మంత్రులు కూడా సిఎంకు సలహా ఇస్తున్నట్లు సమాచారం. దాంతో ఉప ఎన్నికలు ఎదుర్కోవటమే మంచిదన్న యోచనకు సిఎంకు వచ్చినట్లు తెలుస్తోంది. టిడిపి, కాంగ్రెస్ పార్టీలకు చెందిన సుమారు 22 మందిని టిఆర్ఎస్ లోకి లాక్కున్న సంగతి అందరికీ తెలిసిందే.
తెలంగాణాలో రాజకీయ పరిస్ధితులు ఈ విధంగా ఉంటే ఏపిలో కూడా అందుకు భిన్నంగా ఏమీ లేవు. ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ నుండి 21 మంది శాసనసభ్యులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు టిడిపిలోకి లాక్కున్నారు. ఫిరాయింపుల పిటీషన్ పై తెలంగాణా విషయంలో సుప్రింకోర్టు ఏ విధంగా స్పందిస్తుందో అన్న విషయమై టిడిపి ఉత్కంఠగా ఎదురు చూస్తోంది.
ఎందుకంటే, వైసీపీ కూడా ఇదే విధమైన కుసును దాఖలు చేసి ఉంది. న్యాయస్ధానం గనుక టిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇస్తే అదే తీర్సును ఏపిలో కూడా వర్తింపచేయాలంటూ వైసీపీ న్యాయస్ధానాన్ని కోరే అవకాశం ఉంది. వైసీపీ వాదనను న్యాయస్ధానం కూడా తోసిపుచ్చే అవకాశాలు తక్కువ.
దాంతో ఇక్కడ కూడా ఫిరాయింపు ఎంఎల్ఏలపై అనర్హత వేటు తప్పదు. పరిస్ధితులు అంత వరకూ రాకముందే వారిచేత కూడా రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు వెళితే బాగుటుందని చంద్రబాబుకు పలువురు సూచిస్తున్నట్లు సమాచారం. దాంతో ఇక్కడ కూడా ఉప ఎన్నికలు తప్పవు. ఈ విషయం గ్రహించింనందుకనే వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నిత్యమూ ఏదో ఒక ఆందోళన పేరుతో ప్రజల్లో ఉండటానికే ప్రాధాన్యత ఇస్తున్నారు.
అందులోనూ ప్రత్యేకహోదా డిమాండ్ తో వచ్చే బడ్జెట్ సమావేశాల తర్వాత తమ ఎంపిలు రాజీనామాలు చేస్తారని జగన్ ఇటీలే బహిరంగంగానే ప్రకటించారు. ఒకవేళ ఫిరాయింపు ఎంఎల్ఏల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు అనివార్యమైతే, పనిలో పనిగా బడ్జెట్ సమావేశాల వరకూ ఆగకుండా వెంటనే తమ ఎపిలతో కూడా రాజీనామాలు చేయించి చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చే యోచనలో జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంటే ఎలాగైనా రెండు రాష్ట్రాల్లో కలిపి సుమారు 50 అసెంబ్లీ, ఎనిమిది పార్లమెంట్ స్ధానాల్లో ఉప ఎన్నికలంటే మామూలు విషయం కాదు. ఏకంగా మధ్యంతర ఎన్నికల వంటివేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.