మంత్రి మల్లారెడ్డిపై తీవ్ర ఆరోపణలు.. టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన మేడ్చల్ జెడ్పీ చైర్మన్

By telugu teamFirst Published Sep 19, 2021, 4:55 PM IST
Highlights

మేడ్చల్ జిల్లా జెడ్పీ చైర్మన్ శరత్ చంద్రా రెడ్డి రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, కమిటీల్లో తమ అనుచరులకు చోటివ్వడం లేదని ఆరోపణలు సంధించారు. ఆయన ఒంటెద్దు పోకడ చర్యలకు నిరసనగానే పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.
 

హైదరాబాద్: టీఆర్ఎస్‌లో అసమ్మతి రాగాలు వినిపిస్తున్నాయి. మంత్రులనూ విమర్శించడానికి అసంతృప్తులు వెనుకాడటం లేదు. తాజాగా మంత్రి మల్లారెడ్డిపై మాజీ ఎమ్మెల్యే తనయుడు, ప్రస్తుత మేడ్చల్ జిల్లా జెడ్పీ చైర్మన్ శరత్ చంద్రా రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. అనంతరం పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.

మంత్రి మల్లారెడ్డి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని శరత్ చంద్ర మండిపడ్డారు. పార్టీ కమిటీలో తమ కార్యకర్తలకు ఆయన చోటివ్వడం లేదని విమర్శించారు. ఆయన ఒంటెద్దుపోకడలకు పోతున్నారని అన్నారు. అందుకే టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు.

మేడ్చల్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీలో గ్రూపు తగాదాలు కొనసాగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, ప్రస్తుత మంత్రి మల్లారెడ్డి అనుచరులు రెండుగా చీలిపోయారు. సుధీర్ రెడ్డికి రావాల్సిన టీఆర్ఎస్ టికెట్‌ను మల్లారెడ్డి కుట్ర చేసి దక్కించుకున్నారని ఆయన వర్గం అసంతృప్తిగా ఉన్నది. దీనిపై టీఆర్ఎస్ అధినాయకత్వం కలుగజేసుకుని వారిని శాంతింపజేసే చర్యలు తీసుకుంది. సుధీర్ రెడ్డి వర్గాన్ని ఉపశమనం చేయడానికి మలిపెద్ది సుధీర్ రెడ్డి తనయుడు శరత్ చంద్రా రెడ్డికి మేడ్చల్ జిల్లా జెడ్పీ చైర్మన్ పదవిని కట్టబెట్టింది.

అయినప్పటికీ ఈ రెండు వర్గాలు పోటాపోటీగానే ఉన్నాయి. ఈ సందర్భంలోనే మేడ్చల్‌లో నూతన కమిటీలు వేస్తున్నారు. ఇందులో శరత్ చంద్రా రెడ్డి ప్రమేయాన్ని తగ్గిస్తూ మల్లారెడ్డి స్వయంగా కమిటీలు వేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. దీనిపైనే శరత్ చంద్రా రెడ్డి అసహనంగా ఉన్నట్టు తెలిసింది. తాజాగా, మంత్రి మల్లారెడ్డిపై ఆరోపణలు చేస్తూ పార్టీ నుంచి తప్పుకుంటున్నట్టు శరత్ చంద్రా రెడ్డి తెలిపారు. 

click me!