వారికి ఆంధ్ర, తెలంగాణల్లో రెండు చోట్ల ఓట్లు

By pratap reddyFirst Published Sep 15, 2018, 8:06 AM IST
Highlights

తెలుగు రాష్ట్రాల్లో 18 లక్షల కామన్ పేర్లు ఉన్నాయని, ఆంధ్ర, తెలంగాణలో వీరికి రెండు చోట్ల ఓట్లు ఉన్నాయని కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) అధికారులకు వివరించినట్లు కాంగ్రెసు నేత మర్రి శశిధర్ రెడ్డి చెప్పారు.  ఓటర్ల జాబితాలో పొరపాట్లు అన్నీ ఉద్దేశపూర్వకంగా జరిగినవేనని ఆయన ఆరోపించారు. 

న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో 18 లక్షల కామన్ పేర్లు ఉన్నాయని, ఆంధ్ర, తెలంగాణలో వీరికి రెండు చోట్ల ఓట్లు ఉన్నాయని కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) అధికారులకు వివరించినట్లు కాంగ్రెసు నేత మర్రి శశిధర్ రెడ్డి చెప్పారు.  ఓటర్ల జాబితాలో పొరపాట్లు అన్నీ ఉద్దేశపూర్వకంగా జరిగినవేనని ఆయన ఆరోపించారు. 

శుక్రవారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో సమావేశమైన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఈనెల 11న ఎన్నికల సంఘం అధికారుల బృందం హైదరాబాద్‌కు వచ్చినప్పుడు వారిని కలిసి మాట్లాడినట్లు కూడా ఆయన తెలిపారు. ఆ రోజు వారికి చెప్పిన విషయాలపై మరికొన్ని వివరాలు సేకరించి వాటిని అందజేసేందుకు వచ్చామని చెప్పారు. 

ఉమేష్ సిన్హాను కలవడాని వెళ్తే ఎన్నికల సంఘం సభ్యులంతా కూర్చొని తాము చెప్పిన అంశాలను విన్నారని ఆయన చెప్పారు. తెలంగాణలో 30 లక్షల డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని తమకు సమాచారం వచ్చిందని, ఓటర్ జాబితా మొత్తంలో 12 శాతం డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని, అది చిన్న విషయమేమీ కాదని ఆయన అన్నారు.  

తాము చెప్పిన అంశాలు వారి దృష్టికి వచ్చినట్లు అధికారులు చెప్పారని అన్నారు. సీడాక్ ద్వారా సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నామని అధికారులు చెప్పినట్లు ఆయన తెలిపారు. అయితే ఎంత సమయం పడుతుందనే దానికి సమాధానం చెప్పలేదని అన్నారు. 

కంప్యూటర్‌లో చూడాల్సింది ఒకటి, ఇంటింటి చర్య కూడా పరిశీలించాల్సి ఉందనిఅధికారులు చెప్పారని మర్రి శశిధర్ రెడ్డి అన్నారు.ఈ ప్రక్రియకు ఇంకా సమయం పట్టడంతో పాటు 2019 సవరణ ప్రక్రియ జనవరి 4న ప్రచురించాల్సి ఉన్నదని, అప్పటిదాకా ఎన్నికలు వాయిదా వేసి ఓటర్ జాబితాపై అనుమానాలు నివృత్తి చేసి ఎన్నికలు నిర్వహించాలని కోరామని ఆయన వివరించారు. 

click me!