ఐదుగురు మిలీషియా సభ్యుల అరెస్ట్.. భద్రాద్రి జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాల్లో హైలర్ట్..

By Sumanth KanukulaFirst Published Dec 4, 2022, 9:35 AM IST
Highlights

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో హై అలర్ట్ కొనసాగుతుంది. చర్ల మండలం యర్రంపాడు అటవీ ప్రాంతంలో శనివారం జరిగిన కూంబింగ్‌లో ఐదుగురు మావోయిస్టు మిలీషియా సభ్యులను భద్రతా బలగాలు అరెస్ట్ చేశాయి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీ మండలాల్లో హై అలర్ట్ కొనసాగుతుంది. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా  ఆర్మీ(పీఎల్‌జీఏ) వారోత్సవాలను విజయవంతం చేయాలని మావోయిస్టులు ప్రకటన విడుదల చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు అప్రమత్తమయ్యారు.  ఏజెన్సీ గ్రామాల్లో భద్రతా బలగాలు విస్తృతంగా కూంబింగ్ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే చర్ల మండలం యర్రంపాడు అటవీ ప్రాంతంలో శనివారం జరిగిన కూంబింగ్‌లో ఐదుగురు మావోయిస్టు మిలీషియా సభ్యులను భద్రతా బలగాలు అరెస్ట్ చేశాయి. చర్ల పోలీసులు, సీఆర్‌పీఎఫ్ సిబ్బంది సంయుక్తంగా ఈ కూంబింగ్‌లో పాల్గొన్నాయి. 

పీఎల్‌జీఏ వారోత్సవాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ, చత్తీస్‌గఢ్‌తో సరిహద్దులో మావోయిస్టుల కదలికలపై నిఘా ఉంచేందుకు శనివారం తెల్లవారుజామున భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ క్రమంలోనే ఐదుగురు మిలీషియా సభ్యుల పట్టుబడ్డారు. అరెస్టయిన వారిని ఛత్తీస్‌గఢ్‌లోని కిస్టారంకు చెందిన వెడమ భీమయ్య, 35, సోడి మూయా, 20, పొడియం అడమయ్య, 26, పూనెం నగేష్, 30, జట్టపాడుకు చెందిన మడకం నగేష్ (20)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. వీరు తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పోలీసులు వెల్లడించారు. గత ఏడాది చర్ల మండలం రామచంద్రాపురం అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ పోలీసులను లక్ష్యంగా చేసుకుని బూబ్ ట్రాప్‌లు అమర్చిన కేసులో వీరి ప్రమేయం ఉన్నట్లుగా తెలిసిందన్నారు. 

ఈ నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్‌ను మరింతగా పెంచారు. రాజకీయ నేతలు  సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని  పోలీసులు హెచ్చరించారు. మరోవైపు పలు గ్రామాల్లో మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. మావోయిస్టు వారోత్సవాల వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని పోస్టర్లలో పేర్కొన్నారు. అభివృద్ధిని అడ్డుకోవడం మావోయిజమా..? అని పోస్టర్లలో ప్రశ్నించారు. ఈ పోస్టర్లు స్థానికంగా  తీవ్ర కలకలం రేపుతున్నాయి.

click me!