
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ల (telangana congress) సమావేశం వాడివేడిగా జరుగుతోంది. ఈ సందర్భంగా నేతలకు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ (manickam tagore) వార్నింగ్ ఇచ్చారు. టైం సెన్స్ లేకపోతే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. 11 గంటలకు మీటింగ్ అయితే 12.30 గంటలకి రావడం ఏంటని ఠాగూర్ ప్రశ్నించారు. వరుసగా 3 సమావేశాలకు రాకపోతే నోటీసులు ఇస్తానని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిష్టానం అనుమతితో పదవుల నుంచి కూడా తొలగిస్తానని ఠాగూర్ వార్నింగ్ ఇచ్చారు.
ఇదే సమయంలో పంజాగుట్ట అంబేద్కర్ విగ్రహం అంశాన్ని లేవనెత్తారు వీహెచ్. రాహుల్ గాంధీ టూర్‌పై చర్చ కానివ్వాలన్నారు ఠాగూర్. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుపై డెడ్‌లైన్ పెట్టి సెటిల్ చేయాలని సీనియర్ నేత జానారెడ్డి (janareddy) కోరారు. అవసరమైతే తాను కూడా వస్తానని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు త్వరలోనే డీసీసీల నియామకం షురూ చేయనున్నారు.
ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు బోస్ రాజు, శ్రీనివాస్ కృష్ణన్ , వర్కింగ్ ప్రెసిడెంట్‌లు జగ్గారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, మహేష్ కుమార్ గౌడ్, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి, రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి, రాంరెడ్డి దామోదర్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి రేణుక ఛౌదరి, గడ్డం వినోద్ పలువురు నేతలు భేటీలో పాల్గొన్నారు.
అంతకుముందు గాంధీభవన్‌లో మహిళా కాంగ్రెస్ నేతల సమావేశంలో రసాభాస చోటుచేసుకుంది. మహిళా నేతలు సునీతరావు, కవిత మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే ఇరువురు బూతులు తిట్టుకున్నారు. అనంతరం సమావేశంలో నుంచి కవిత బయటకు వెళ్లిపోయింది. ఈ ఘటన ప్రస్తుతం కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.