అన్న చనిపోవడంతో ఆస్తి మొత్తం వదినకే వస్తుందన్న కోపంతో మరిది దారుణానికి ఒడిగట్టాడు. కత్తితో దాడిచేసి హత్య చేశాడు.
హన్మకొండ : తెలంగాణలోని హనుమకొండలో దారుణమైన ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి స్వయానా అన్న భార్యను పంచాయతీ పెద్దలు ముందే కత్తితో దాడి చేసి.. దారుణంగా హత్య చేశాడు. ఆమె బతికుంటే ఆస్తి తనకు రాదని ఈ దారుణానికి ఒడిగట్టాడు. తోడబుట్టిన అన్న ఇటీవలే ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అతని ఆస్తి వదిన తీసుకుంటే తనకు ఏమీ రాదని మరిది కక్ష పెంచుకున్నాడు.
ఈ కక్ష తోనే పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టాడు. ఆ పంచాయతీలోనే ఆమెపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు గ్రామంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి సిఐ ప్రవీణ్ కుమార్ తెలిపిన కథనం ఇలా ఉంది.
శిరీష డెడ్ బాడీకి రీపోస్టు మార్టం.. పొంతనలేని సమాధానాలు చెబుతున్న తండ్రి...
పురాణం జంపయ్య, స్వరూప (35) భార్యభర్తలు. వీరు ముల్కనూరు వాసులు. నిరుడు ఫిబ్రవరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జంపయ్య మృతి చెందాడు. అప్పటినుంచి ఆస్తి విషయంలో భర్త తమ్ముడు సమ్మయ్యతో తరచుగా గొడవలు జరుగుతున్నాయి. ఆస్తిలో వాటాల విషయం మాట్లాడడానికి స్వరూప తన తమ్ముడు మోటం గురువయ్య, అతడి భార్య తిరుపతమ్మతో కలిసి ఆదివారం పెద్ద మనుషుల సమక్షంలో కూర్చున్నారు. మరిది సమ్మయ్యను పిలిపించారు.
ఈ పిలుపుమేరకు అక్కడికి వచ్చిన సమ్మయ్య ఇరుపక్షాల మధ్య చర్చలు జరుగుతుండగానే.. తన వెంట తెచ్చుకున్న కొబ్బరి బొండాలు కొట్టే కత్తితో వదిన స్వరూప మీద విచక్షణ రహితంగా దాడి చేశాడు. పెద్దమనుషులు ఆపే ప్రయత్నం చేసినా వినకుండా స్వరూప తల, ఇతర శరీర భాగాలపై ఇష్టం వచ్చినట్లుగా నరికాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అది చూసి షాక్ అయిన మిగతావారు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. సమ్మయ్యను అదుపులోకి తీసుకొని ఘటనస్థలిని పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లుగా సీఐ తెలిపారు.