
మెదక్ : మెదక్ జిల్లాలో ఒక విచిత్రమైన ఘటన జరిగింది. ఇద్దరి మగాళ్ళ మధ్య పెళ్లి జరిగింది. ఇది కామనే కదా.. ఈ మధ్య అక్కడక్కడా గే మ్యారేజ్ లు అఫీషియల్ గానే జరుగుతున్నాయి కదా.. అనుకుంటున్నారా? ఇది అది కూడా కాదు. ఎందుకంటే.. వారిద్దరూ ‘గే’ లు కాదు. ప్రేమించుకోలేదు. ఒకరు లేకుండా మరొకరం ఉండలేమని.. మనది జన్మజన్మల బంధం అని బాసలు చేసుకోలేదు. పురుషుడి శరీరంలో స్త్రీ ఆత్మ లేదు. వారిద్దరూ మానసికంగా, శారీరకంగానూ నిఖార్సైన పురుషులే...మరెలా పెళ్లి చేసుకోవడం ఏంటనే కదా.. అనుమానం.. అయితే స్టోరీ చదవండి...
తాగిన మైకంలో...
కల్లు కాంపౌండ్ బాగా తాగి.. ఆ తాగిన మైకంలో ఒకరు మరొకరితో తాళి కట్టించుకున్నారు. ఆ తర్వాత కాపురానికి వచ్చాను అంటూ తాళి కట్టిన యువకుడి ఇంటిముందు వాలిపోయాడు. ఇది చూసి.. యువకుడికి తాగిన మత్తు దిగిపోయి.. నిలువెల్లా చెమటలు రాగా... అతని తల్లిదండ్రులు అవాక్కయ్యారు. ఆ తరువాత తేరుకున్న తల్లిదండ్రులు అతడిని మందలించి పంపించేశారు. అయినా వినకుండా తాళి కట్టించుకున్న యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. అంతేనా.. నాకు తాళి కట్టి మోసం చేశాడు... అని ఫిర్యాదు చేసి.. ఆ వ్యక్తి రూ. లక్ష ఇస్తేగానీ ఫిర్యాదు వాపసు తీసుకోనని మొండికేశాడు.
ఎక్కడ జరిగింది?
ఈ అనూహ్య ఘటన మెదక్ జిల్లా చిలప్ చెడ్ లో మంగళవారం వెలుగుచూసింది. ఇందులోని పాత్రధారుల్లో ఒకరు సంగారెడ్డి జిల్లా జోగిపేట కు చెందిన ఇరవై ఒక్క ఏళ్ల యువకుడు.. కాగా, రెండో వ్యక్తి చిలప్ చెడ్ మండలం చండూర్ కి చెందిన 22 యేళ్ల ఆటో డ్రైవర్. ఇక వీరిద్దరి పెళ్లికి వేదికయ్యింది మాత్రం.. కొల్చారం మండలం దుంపల కుంట లోని ఓ కళ్ళు దుకాణం. అక్కడ తాగడానికి వచ్చిన వీరిద్దరికీ అప్పుడే, అక్కడే పరిచయం లో ఏర్పడింది. తొలిచూపు వలపు లాగా.. తాగిన మైకం తలకెక్కి.. ఇద్దరికీ ఏం జరిగిందో తెలీదు.. కానీ పెళ్లి చేసుకునేదాకా సీన్ పండింది.
నీ భార్యను నేనే..
ఈనెల 1న తాగిన మైకంలో ఉన్న చండూరు యువకుడు మరో యువకుడితో తాళి కట్టించుకునే వరకు పోయింది. అప్పటికి కల్లు మైకంలో తాము చేసింది.. సరదాగా, బాగానే అనిపించింది. అయితే కల్లు కాంపౌండ్ నుండి బైటికి వచ్చాక కళ్లు తిరిగి.. ఇహలోకంలోకి వచ్చి నాలిక్కరుచుకున్నారు. అయితే.. ఇందులో తాళి కట్టించుకున్న యువకుడికి బుర్ర పనిచేయడమూ మొదలు పెట్టింది. ఇంకేముంది.. తాళి కట్టిన యువకుడే నా మొగుడంటూ కొత్త ఎత్తు ఎత్తాడు..అతడి ఇంటిముందు బైఠాయించాడు.
ఆ తరువాత కేసు కూడా పెట్టడంతో.. చివరికి పోలీసులు, గ్రామ పెద్దలు ఇద్దరు యువకుల కుటుంబ సభ్యులను పిలిపించి చర్చించారు. చివరికి చండూరు యువకుడి కుటుంబీకులతో పది వేలు ఇప్పించడంతో కథ సుఖాంతమైంది. జోగిపేట యువకుడి ఫిర్యాదు తీసుకున్నట్లు చిలప్ చెడ్ ఠాణా ఎస్ఐ మహమ్మద్ గౌస్ తెలిపారు. అదండీ సంగతి.. సో తాగిన తరువాత బ్రో.. బ్రో.. అంటూ తిరగడం నిన్నటి ఫ్యాషన్.. తాళి కట్టించుకోవడం నేటి ఫ్యాషన్.. అందుకే.. జాగ్రత్త బ్రోస్....