
తెలంగాణలోని కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో కొడుకు మరణించిన కొన్ని గంటలకే మనోవేదనతో తండ్రి తన జీవితాన్ని ముగించాడు. ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషాదకర ఘటన వాంకిడి మండలం సామెల గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు.. వాంకిడి మండలం జైత్‌పూర్ క్రాస్‌రోడ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తులసీరాం అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న తులసీరామ్ తండ్రి భీమ్‌రావ్ తీవ్ర మనోవేదనకు గురయ్యారు. కొడుకు మరణించిన కొన్ని గంటలకే సామెల గ్రామంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఇక, తులసీరామ్‌కు ఇటీవలే ఓ యువతితో నిశ్చితార్థం జరిగింది. అయితే స్కూటర్ మీద ప్రయాణిస్తున్న తులసీరామ్.. వాంకిడి మండలం జైత్‌పూర్ క్రాస్‌రోడ్ వద్ద వేగంగా వస్తున్న లారీ చక్రాల కింద పడి మృతిచెందాడు. లారీ డ్రైవర్ అతివేగంగా, నిర్లక్ష్యంగా నడపడమే ఈ ప్రమాదానికి కారణమని అనుమానిస్తున్నారు. కొడుకు మరణవార్తతో దిగ్భ్రాంతికి గురైన భీమ్‌రావ్ పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే ఆసిఫాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. అయితే భీమ్‌రావ్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కొన్ని గంటల్లోనే ఇద్దరి మరణాలతో వారి కుటుంబంతో తీవ్ర నిషాదం నెలకొంది.
ఈ క్రమంలోనే లారీ డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని, రూ.30 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తులసీరామ్ బంధువులు ధర్నాకు దిగారు. కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో వారు నిరసన విరమించారు. ఇక, రోడ్డు ప్రమాదం అనంతరం పరారీలో ఉన్న లారీ డ్రైవర్‌పై హిట్ అండ్ రన్ కేసు నమోదు చేశారు. నిందితుడైన డ్రైవర్‌ను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.
(జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 ) కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.)