మూడు రోజులుగా చెట్టుకే వేలాడుతున్న మృతదేహం.. పోలీసులే కారణమా?

By Arun Kumar PFirst Published Dec 8, 2020, 1:57 PM IST
Highlights

మూడు రోజుల క్రితం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఓ వ్యక్తి మృతదేహం ఇంకా చెట్టుకు వేలాడుతూనే వుంది.

నిజామాబాద్: ఓ మహిళ హత్యకేసుతో సంబంధాలున్నాయని అనుమానిస్తూ పోలీసులు అరెస్ట్ చేయడంతో మనస్థాపానికి గురయిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇలా ఆదివారం చెట్టుకు ఉరేసుకోగా ఇప్పటికీ మృతదేహాం చెట్టుకు వేలాడుతుంది. మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు మృతదేహాన్ని చెట్టుపై నుండి కిందకు దించడాన్ని నిరాకరిస్తుండటంతో పోలీసులు కూడా ఏం చేయలేకపోతున్నారు.

వివరాల్లోకి వెళితే... గత అక్టోబర్‌లో నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది గ్రామానికి చెందిన మమత అనే మహిళ హత్య జరిగింది. ఈ హత్యకేసుపై విచారణ జరుపుతున్న పోలీసులు అదే గ్రామానికి చెందిన గంగాధర్‌ను అనుమానించారు. దీంతో అతడిని పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారించారు. ఇలా విచారణ అనంతరం అతడికి ఏమయ్యిందో తెలీదు కానీ గ్రామ సమీపంలో ఓ చెట్టుకు ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

పోలీసులు తీవ్రంగా కొట్టి హత్యచేసినట్లు ఒప్పుకోవాలని ఒత్తిడిచేయడం వలనే గంగాధర్ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు, బంధువుల ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం జరిగేవరకు మృతదేహాన్ని కదిలించనివ్వబోమని అంటున్నారు. దీంతో గత మూడు రోజులుగా గంగాధర్ మృతదేహం చెట్టుకే వేలాడుతోంది.  

ఇలా విచారణ పేరిట అమాయకుడి ఆత్మహత్యకు కారణమైన పోలీసులను వెంటనే సస్పెండ్‌ చేయాలని, అలాగే మమత హత్య కేసులో అసలైన నిందితులను తక్షణం పట్టుకోవాలని గ్రామస్తులు డిమాండ్‌ చేశారు.  ఇరు కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేయాలని, గంగాధర్‌ కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు.  
 

click me!