అంబులెన్స్‌కు డబ్బుల్లేక.. చేతులపైనే బిడ్డ శవాన్ని మోసుకెళ్లిన తండ్రి

By narsimha lodeFirst Published Sep 2, 2019, 6:16 PM IST
Highlights

కుమార్తె మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లడానికి చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో సంపత్ కుమార్.. ప్రభుత్వ అంబులెన్స్ ఇవ్వాలని కోరాడు. అయితే అంబులెన్స్ పనిచేయడం లేదని అధికారులు సమాధానమిచ్చారు. దీంతో చేసేదేం లేక స్ట్రెచర్‌పై ఆసుపత్రి ఎంట్రన్స్ వరకు కూతురి శవాన్ని తీసుకొచ్చి.. అక్కడి నుంచి ఆటో స్టాండ్ వరకు మోసుకెళ్లాడు. 

అంబులెన్స్‌లో తీసుకెళ్లే శక్తి లేక భార్య శవాన్ని కిలోమీటర్ల దూరం వీపుపై మోసుకెళ్లిన భర్త ఉదంతం చూసి దేశం చలించిపోయింది. ఎక్కడో ఏజెన్సీలో జరిగిన ఈ సంఘటనలు తాజాగా మహానగరాల్లోనూ జరుగుతున్నాయి. ఇటువంటి సంఘటనే కరీంనగర్‌లో కూడా జరిగింది.

నగరంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో చిన్నారి చనిపోయింది. అయితే ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు అందుబాటులో అంబులెన్స్ లేకపోవడంతో కూతురు శవాన్ని తన చేతులపై మోసుకెళ్లాడో తండ్రి. ఈ ఘటనను చూసిన వారంతా చలించిపోయారు.

డబ్బులు లేవని బ్రతిమలాడినా సిబ్బంది నిర్లక్ష్యపు సమాధానంతో బోరున ఏడుస్తూ ఆటో స్టాండ్ వరకు బిడ్డ శవాన్ని చేతులపైనే తీసుకెళ్లాడు. కూతురి మరణం ఒకవైపు.. అధికారుల నిర్లక్ష్యపు మాటలు మరోవైపు ఆ తండ్రిని మరింత క్రుంగదీశాయి.

వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండలం కూనారం గ్రామానికి చెందిన సంపత్ ఏడేళ్ల కుమార్తె కోమలత గత కొన్నాళ్లుగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతోంది.

దీంతో ఆమెను కరీంనగర్‌లోని ప్రభుత్వాసుపత్రిలో చేర్చి వైద్యం అందిస్తున్నారు. కార్పోరేట్ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించేందుకు డబ్బులు లేకపోవడంతో కోమలత ఆరోగ్యం విషమించి.. ఆదివారం కోమలత తుదిశ్వాస విడిచింది.

కుమార్తె మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లడానికి చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో సంపత్ కుమార్.. ప్రభుత్వ అంబులెన్స్ ఇవ్వాలని కోరాడు. అయితే అంబులెన్స్ పనిచేయడం లేదని అధికారులు సమాధానమిచ్చారు.

దీంతో చేసేదేం లేక స్ట్రెచర్‌పై ఆసుపత్రి ఎంట్రన్స్ వరకు కూతురి శవాన్ని తీసుకొచ్చి.. అక్కడి నుంచి ఆటో స్టాండ్ వరకు మోసుకెళ్లాడు. ఒక ఆటోడ్రైవర్ మానవత్వంతో కోమలత మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లేందుకు ముందుకొచ్చాడు.

ఈ హృదయ విదారక ఘటన చూసిన రోగులు, జనం చలించిపోయారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సొంత జిల్లాలోనే ఇలాంటి ఘటన జరగడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

click me!