మల్లారెడ్డి.. దమ్ముంటే అవినీతిపై విచారణకు సిద్ధమవ్వు: దాసోజు శ్రవణ్

By telugu teamFirst Published Aug 26, 2021, 8:03 PM IST
Highlights

రాష్ట్ర మంత్రి మల్లారెడ్డికి దమ్ముంటే అవినీతి ఆరోపణలపై విచారణకు సిద్ధమవ్వాలని టీపీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ సవాల్ విసిరారు. ఎంపీగా రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని మల్లారెడ్డి డిమాండ్ చేస్తున్నారని, అందుకు మల్లారెడ్డి స్వయంగా అవినీతి ఆరోపణల్లో నిర్దోషిగా రుజువు చేసుకుంటే చాలని, రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తారని తెలిపారు.
 

హైదరాబాద్: రాష్ట్ర మంత్రి మల్లారెడ్డికి టీపీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ సవాల్ విసిరారు. తనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన అవినీతి ఆరోపణలను విచారణకు సిద్ధమవ్వాలని అన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసి సవాల్ నుంచి తప్పించుకోవద్దని చెప్పారు. రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని మంత్రి మల్లారెడ్డి డిమాండ్ చేస్తున్నాడని, అది జరగాలంటే ముందు ఆయన తనపై కాంగ్రెస్ చేసిన ఆరోపణలను విచారించి నిర్దోషిగా నిరూపించుకోవాలన్నారు. అలా చేస్తే రేవంత్ రెడ్డి స్వయంగా ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని అన్నారు కదా అని వివరించారు.

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఊరికే ఆరోపణలు చేయలేదని, ప్రాథమిక ఆధారాలతోనే మాట్లాడారని దాసోజు శ్రవణ్ అన్నారు. ‘నీ కోడలు పేరున్న ఆస్పత్రి, నీ మెడికల్ కాలేజీ, నీ ఇంజినీరింగ్ కాలేజీలు, యూనివర్సిటీ భూములపైన అవినీతి ఆరోపణలు చేస్తున్నాం. రుజువు చేయాలని నువ్వు డిమాండ్ చేస్తున్నావు కదా. మా ఆరోపణలపై విచారణకు సీఎం కేసీఆర్‌ను ఆదేశించాలని అడుగు. అప్పుడు విచారణ జరిగి ఈ ఆరోపణలు అవాస్తవాలని తేలితే మేం రాజకీయాల నుంచి తప్పుకుంటాం’ అని సవాల్ విసిరారు.

మంత్రి మల్లారెడ్డి శాసనసభ పరిధిలోని మూడు చింతలపల్లిలోనే రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారని శ్రవణ్ గుర్తుచేశారు. దళిత, గిరిజన ఆత్మ గౌరవ దీక్ష వేదికపై ఆధారాలతోపాటు మంత్రిపై అవినీతి ఆరోపణలు చేశారన్నారు. ఈ ఆరోపణలపై విచారణ జరిపితే అవినీతి లేదని తేలితే రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తారని తెలిపారు. రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని అనుకుంటే నిర్దోషిగా నిరూపించుకోవాలని అన్నారు. అంతేకానీ, తిట్లపురాణం మొదలుపెట్టి, తిట్ల రాజకీయాలే చేయాలని భావిస్తే, ఆయన కంటే ఎక్కువ తిట్లు వచ్చునని చెప్పారు.

click me!