తెలంగాణ కొత్త పీసీసీ చీఫ్ ఇతనే..! జగ్గారెడ్డి, మధుయాష్కి కంటే తోపా..!! 

By Arun Kumar P  |  First Published Jul 5, 2024, 5:05 PM IST

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు..? ఇక తెలంగాణ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు ఎవరు..? అసెంబ్లీ ఎన్నికలు ముగిసినప్పటి నుండి ఈ ప్రశ్న రాజకీయా వర్గాల్లోనే కాదు రాష్ట్ర ప్రజల్లోనూ  మెదులుతోంది. ఈ సస్పెన్స్ కు తెరదించుతూ టిపిసిసి చీఫ్ ఎవరో అదిష్టానం నిర్ణయించిందట... ఆయనెవరో కాదు... 


Telangana PCC President : తెలంగాణలో కీలకమైన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ముగిసాయి. అసెంబ్లీలో అధికార బిఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది... పార్టీ గెలుపులో కీలకపాత్ర పోషించిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత కూడా ఆయన సారథ్యంలోనే లోక్ సభ ఎన్నికల బరిలో దిగిన కాంగ్రెస్ మంచి సీట్లు సాధించింది. ఇలా రెండు ఎన్నికల్లోనూ మంచి ప్రదర్శన చేసి ఊపుమీదున్న కాంగ్రెస్ ఇప్పుడు సంకటస్థితిలో పడింది. రేవంత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో పార్టీ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. రేవంత్ మాదిరిగా పార్టీని సమర్దవంతంగా నడిపే నాయకుడికే ఈ బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్ అదిష్టానం భావిస్తోంది... ఇందుకోసం ఇప్పటికే ముమ్మర కసరత్తు చేపట్టింది. 

అయితే తెలంగాణ కాంగ్రెస్ బాస్ ఎవరన్న సస్పెన్స్ కు ఇప్పటికే తెరడినట్లు తెలుస్తోంది. అదిష్టానం టిపిసిసి చీఫ్ ను ఇప్పటికే ఎంపికచేసిన రాష్ట్ర నాయకుల్లో ఏకాభిప్రాయం కుదరకపోవడం వల్లే అధికారిక ప్రకటన రావడంలేదనేది కాంగ్రెస్ వర్గాల టాక్. అధికారంలో వున్న రాష్ట్రం కావడంతో టిపిసిసి అధ్యక్ష పదవిపై చాలామంది సీనియర్లు కన్నేసారు... రేసులో చాలా పేర్లు వినిపించాయి. చివరకు ప్రస్తుత కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. 

Latest Videos

ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టిపిసిసి పదవిని వదులుకోడానికి సిద్దమయ్యారు... కాబట్టి కొత్త పిసిసి ఎంపికకు ఎలాంటి అడ్డంకులు లేవు. ఇప్పటికే రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర కీలక మంత్రులను డిల్లీకి పిలిపించుకుని కొత్త పిసిసి ఎవరైతే బావుంటుందని అదిష్టానం చర్చించింది. ఈ క్రమంలోనే కొన్నిపేర్లు పరిశీలనలోకి రాగా... సీఎం, డిప్యూటీ సీఎం అంగీకారంతో  మహేష్ కుమార్ గౌడ్ పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అయితే కొందరు కాంగ్రెస్ సీనియర్లు కొత్త పిసిసి చీఫ్ ఎంపికపై ఏకాభిప్రాయానికి రాకపోవడంతో అధికారిక ప్రకటన వెలువడలేదని తెలుస్తోంది. అందరినీ ఒప్పించి మహేష్ కుమార్ గౌడ్ నే ఫైనల్ చేయాలన్న ఆలోచనలో కాంగ్రెస్ అదిష్టానం వున్నట్లు సమాచారం. 

అసలు ఎవరీ మహేష్ కుమార్ గౌడ్ : 

బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ 1966 ఫిబ్రవరి 24న నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం రహత్ నగర్ లో జన్మించారు. అతడి తండ్రి గంగాధర్ గౌడ్... కులవృత్తి చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవారు.  సామాన్య మద్యతరగతి కుటుంబానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్ విద్యాబ్యాసం అంతా స్థానికంగానే సాగింది.... ఇంటర్ తర్వాత డిగ్రీ చేసేందుకు నిజామాబాద్ లో అడుగుపెట్టారు మహేష్ కుమార్ గౌడ్. అదే అతడి జీవితాన్ని మలుపుతిప్పింది.  

నిజామాబాద్ లోని గిరిరాజ్ కాలేజీలో డిగ్రీ చేస్తున్న సమయంలోనే రాజకీయాలపై ఆసక్తితో కాంగ్రెస్ విద్యార్థి విభాగం  ఎన్‌ఎస్‌యూఐ లో చేరాడు. ఈ స్టూడెంట్ యూనియన్ లో యాక్టివ్ గా పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తారు. స్టూడెంట్ యూనియన్ లో కష్టపడి  పనిచేస్తూ కాంగ్రెస్   పార్టీ బలోపేతానికి పనిచేసాడు... దీంతో అతడికి కాంగ్రెస్ యువజన విభాగంలో చోటుదక్కింది. ఇలా విద్యార్థి నాయకుడు కాస్త రాజకీయ నాయకుడిగా మారిపోయారు మహేష్ కుమార్ గౌడ్. 

చాలాకాలం కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన తర్వాత 1994 లో డిచ్ పల్లి అసెంబ్లీకి పోటీచేసే అవకాశం దక్కింది. చాలా చిన్నవయసులోనే అవకాశం వచ్చినా ఎమ్మల్యే కాలేకపోయారు. ఆ తర్వాత కూడా 2014లో నిజామాబాద్ అర్భన్ అసెంబ్లీకి పోటీచేసి ఓడిపోయారు. ఇలా వరుస ఓటములు ఎదురైనా ఏమాత్రం కుంగిపోకుండా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు క‌ృషిచేసారు. గత పదేళ్లలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు... చివరకు పిసిసి చీఫ్ లుగా చేసినవారు కూడా పార్టీమారినా మహేష్ కుమార్ గౌడ్ ఆ ఆలోచన చేయలేదు. కాంగ్రెస్ పార్టీ  కష్టకాలంలో వుండగా అండగా నిలిచాడు... ఇదే ఆయనను అదిష్టానం ద‌ృష్టిలో పడేలా చేసింది. 

పార్టీ కోసం ఎమ్మెల్యే సీటు త్యాగం : 

మహేష్ కుమార్ గౌడ్ పార్టీ కోసం వరుసగా రెండుసార్లు తాను పోటీచేద్దామన్న సీటును త్యాగం చేసారు.  2018 నిజామాబాద్ అర్బన్ నుండి పోటీకి సిద్దమయ్యారు... కానీ ఆ సీటును అదిష్టానం మైనారిటీలకు కేటాయించింది. అదిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా పోటీ నుండి తప్పుకున్నారు. దీంతో ఆ ఎన్నికల్లో అతడికి మేనిఫెస్టో కమిటీ కన్వీనర్ బాధ్యతలు అప్పగించింది కాంగ్రెస్. 

మహేష్ కుమార్ గౌడ్ కు పార్టీపట్ల వున్న అంకితభావాన్ని గుర్తించిన కాంగ్రెస్ పెద్దలు 2021లో పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డితో కలిసి బిఆర్ఎస్ ను సమర్దవంతంగా ఎదుర్కొన్నారు... దీంతో అతడికి మరిన్ని కీలక బాధ్యతలు దక్కాయి. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఏర్పాటుచేసిన ఎన్నికల కమిటీ సభ్యునిగా కూడా పనిచేసారు. 

అయితే 2023  అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి నిజామాబాద్ సీటును ఆశించి  భంగపడ్డారు మహేష్ కుమార్ గౌడ్. కామారెడ్డి నుండి రేవంత్ రెడ్డి పోటీకి దిగడంతో నిజామాబాద్ అర్భన్ సీటు మాజీ మంత్రి షబ్బీర్ అలీకి కేటాయించారు. దీంతో టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా వున్నా పోటీచేసే అవకాశం దక్కలేవు... అయినప్పటికీ ఆయన ఎలాంటి నిరాశకు గురికాలేదు. పార్టీ కోసం పనిచేస్తే పదవులు వాటంతట అవే వస్తాయని నమ్మిన అతడు చాలా ఈజీగా రెండోసారి కూడా తన సీటును త్యాగం చేసారు. 

2023 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ తెలంగాణలో మొదటిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఇలా ప్రభుత్వం ఏర్పడిందో లేదో అలా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి... దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో సీటును త్యాగం చేసిన మహేష్ కుమార్ గౌడ్ కు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు.  ఇలా ఎమ్మెల్యే కాలేకపోయిన ఆయన ఎమ్మెల్సీగా మారి మండలిలో అడుగుపెట్టారు. 

పిసిసి చీఫ్ గా ఈయనే ఎందుకు..? 

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు కావాల్సిన అన్ని అర్హతలు మహేష్ కుమార్ గౌడ్ కు వున్నాయి. పార్టీలో చాలా సీనియర్...తెలంగాణ ఏర్పాటు తర్వాత కాంగ్రెస్ హేమాహేమీలు బిఆర్ఎస్ లో చేరినా ఆయన అలాంటి ఆలోచనే రానివ్వలేదు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచారు. పార్టీ కోసం తన సీటును కూడా త్యాగం చేసారు. 

ఇక సామాజికవర్గం పరంగా చూసుకున్నా మహేష్ కుమార్ గౌడ్ బిసి. ఇప్పటికే కాంగ్రెస్ అంటేనే అగ్రకుల ఆదిపత్యం కలిగిన పార్టీగా ముద్రపడింది. మరీముఖ్యంగా ఈ పార్టీలో రెడ్డిల ఆధిపత్యం ఎక్కువనేది బయట టాక్. ఇప్పటివరకు టిపిసిసి అధ్యక్షులుగా చేసినవారిలో ఇద్దరు (ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి)  అదే సామాజిక వర్గానికి చెందినవారు. మరోవైపు బిజెపి బిసి మంత్రం జపిస్తోంది... దీంతో సామాన్య, మద్యతరగతి ప్రజలు కమలం పార్టీ వెంట నడుస్తున్నారు. దీంతో తెలంగాణలో రోజురోజుకు మరింత బలపడుతున్న బిజెపిని ఎదుర్కొనేందుకు ఓ బిసికి టిపిసిసి అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్ అదిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది.. .అందుకోసమమే మహేష్ కుమార్ గౌడ్ కు అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. 

ఇదిలావుంటే ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డితో మహేష్  కుమార్ కు సత్సంబంధాలున్నాయి. ఒక్క రేవంత్ తోనే కాదు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర సీనియర్లతోనూ ఈయన సఖ్యతగానే వుంటారు. కాబట్టీ ఈయన పేరునే అత్యధికులు టిపిసిసి చీఫ్ పదవి  కోసం ప్రతిపాదించారట... దీంతో అదిష్టానం కూడా  ఈయననే ఎంపిక చేసిందట. అయితే కొంతమంది అదిష్టానం నిర్ణయంతో ఏకాభిప్రాయానికి రాకపోవడంతో ప్రకటన వాయిదా పడినట్లు తెలుస్తోంది. 

జగ్గారెడ్డి, మధుయాష్కి కంటే మహేష్ తోపా..? 

 మాజీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు జగ్గారెడ్డి, మధుయాష్కి గౌడ్, సంపత్ కుమార్ పేర్లు కూడా టిపిసిసి చీఫ్ రేసులో వినిపించాయి. అయితే వీరందరికీ గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేసే అవకాశం వచ్చింది... కానీ ఓడిపోయారు. కానీ మహేష్ కుమార్ గౌడ్ పార్టీ కోసం తన సీటును త్యాగం చేసారు. ఇలా పార్టీకోసం నిస్వార్థంగా వ్యవహరించిన మహేష్ కుమార్ వైపే కాంగ్రెస్ అదిష్టాన మొగ్గుచూపిందట.  

ఇక రేవంత్ రెడ్డి కూడా మహేష్ కుమార్ గౌడ్ కే మద్దతుగా నిలిచారు. జగ్గారెడ్డి, మధుయాష్కి వంటివారికి పిసిసి బాధ్యతలు అప్పగిస్తే కాంగ్రెస్ లో మరో పవర్ సెంటర్ తయారవుతుంది. అలాకాకుండా తనకు అనుకూలంగా వుండే మహేష్ ను నియమిస్తే ఎలాంటి బాధ వుండదని... ప్రభుత్వంతో పాటు పార్టీ కూడా తనచేతిలోనే వుంటుందన్నది రేవంత్ ఆలోచనగా తెలుస్తోంది. అందువల్లే అదిష్టానాన్ని ఒప్పించి మహేష్ కుమార్ గౌడ్ ను పిసిసి సీట్లో కూర్చోబెట్టేందుకు అన్ని సిద్దం చేసారు రేవంత్.  త్వరలోనే టిపిసిసి  చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ పేరు ప్రకటించే అవకాశాలున్నాయి. 

click me!