ప్రేమోన్మాది దాడి: స్పృహలోకి వచ్చి బోరున విలపించిన మధులిక

By Nagaraju penumalaFirst Published Feb 18, 2019, 8:52 PM IST
Highlights

దాడి చేస్తున్న సమయంలో చుట్టూ ఎంతోమంది ఉన్నారని అయితే తాను ఎంత అరిచినా ఎవరూ దగ్గరికి రాలేదు అని కనీసం భరత్ ను అడ్డుకునే ప్రయత్నం కూడా చెయ్యలేదంటూ మధులిక కన్నీరుమున్నీరయ్యింది.  

హైదరాబాద్: హైదరాబాద్‌లోని బర్కత్‌పురాలో ప్రేమోన్మాది దాడిలో తీవ్ర గాయాలపాలై చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడిన మధులిక ఎట్టకేలకు స్పృహలోకి వచ్చింది. ఇంటర్మీయడిట్ చదువుతున్న మధులిక తన ప్రేమను నిరాకరిస్తుందన్న నెపంతో భరత్ అనే ప్రేమోన్మాది కత్తితో అత్యంత పాశవికంగా దాడి చేశాడు. 

ఫిబ్రవరి 6 బుధవారం కళాశాలకు వెళ్తుండగా బర్కత్ పురా వద్ద మధులికపై ప్రేమోన్మాది భరత్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఫిబ్రవరి 6 నుంచి నేటి వరకు స్పృహలోకి రాకపోవడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. అటు వైద్యులు సైతం ఐసీయూలో అత్యవసర చికిత్సలు అందిస్తున్నారు. 

అయితే సోమవారం సాయంత్రం మధులిక స్పృహలోకి రావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. చాలా రోజుల తరువాత స్పృహలోకి వచ్చిన మధులిక పోలీసులు కేసుకు సంబంధించి ఆరా తీశారు. దాడి ఘటనకు సంబంధించి మధులిక ఇచ్చిన స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డు చేసుకున్నారు.

మధులిక వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ సమక్షంలో  పోలీసులు రికార్డ్ చేశారు. భరత్ తనకు చిన్నప్పటి నుంచి పరిచయం అని, ఒకే కాలనీ వాళ్ళంకావడంతో భరత్ తో మాట్లాడుతుండేదానన్నని తెలిపింది. అయితే భరత్ తనపై ఇంత కోపాన్ని పెట్టుకుంటాడని కలలో కూడా అనుకోలేదని కన్నీళ్లు పెట్టుకుంది. 

మూడేళ్ళుగా ప్రేమ పేరుతో భరత్ తనను వేధిస్తున్నాడు అని, భరత్ ప్రేమను తాను నిరాకరించడంతో మరింత రెచ్చిపోయి వేధింపులకు పాల్పడేవాడని స్పష్టం చేసింది. గత మూడు నెలల నుంచి వేధింపులు ఎక్కువ అవ్వడంతో ఆ విషయాన్ని తన తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లినట్లు మధులిక వాంగ్మూలంలో తెలిపింది. 

తల్లిదండ్రులతో కలిసి షీ టీమ్ భరోసా సెంటర్ ని ఆశ్రయించినట్లు తెలిపింది. పోలీసుల కౌన్సిలింగ్ ఇవ్వడంతో భరత్ మారతాడనుకున్నానని కానీ తనపై ఇంత కోపం పెంచుకుంటాడని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. 

ఎప్పటిలాగే బుధవారం కూడా కాలేజీకి వెళ్ళడానికి బయల్దేరాను అని అయితే వెనుక నుండి భరత్ అసభ్యకరంగా బూతులు తిడుతూ వచ్చాడని చివరిగా కత్తితో తనపై దాడి చేశాడని బోరున విలపించింది. 

దాడి చేస్తున్న సమయంలో చుట్టూ ఎంతోమంది ఉన్నారని అయితే తాను ఎంత అరిచినా ఎవరూ దగ్గరికి రాలేదు అని కనీసం భరత్ ను అడ్డుకునే ప్రయత్నం కూడా చెయ్యలేదంటూ మధులిక కన్నీరుమున్నీరయ్యింది.  

click me!