
హైదరాబాద్: వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని కలలు కన్నారు. దగ్గర బంధువులే కావడంతో పెళ్లికి పెద్దలు అడ్డు చెప్పరని అనుకున్నారు. కానీ ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. కలిసి బతకలేకపోయినా కనీసం చావులోనైనా కలిసి చావాలనుకున్నారు. అంతే ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాదఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం టంగుటూరు గ్రామానికి చెందిన లావణ్య, ఎల్లేశ్ బావా మరదళ్లు. ఇద్దరిదీ ఒకే కులం. దగ్గర బంధువులు కావడంతో ఇద్దరు గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. బావా మరదళ్లు కావడంతో ఇరు కుటుంబాలు చూసీ చూడనట్లుగా వ్యవహరించాయి. తీరా పెళ్లి విషయం వచ్చేసరికి ఇరు కుటుంబాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.
అయితే తాము కలిసి జీవించే అవకాశం ఉండదేమోనన్న అనుమానంతో ఎల్లేష్ మానసికంగా కృంగిపోయాడు. ఆదివారం సాయంత్రం ఇంట్లో నుంచి కోపంగా వెళ్లిపోయాడు. మరదలు లావణ్యకు ఫోన్ చేసి తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు చెప్పాడు. నువ్వు లేకపోతే నేను ఉండలేను నేను చనిపోతానంటూ లావణ్య బదులిచ్చింది.
ఫోన్ పెట్టేసి ఇంట్లోకి వెళ్లిన లావణ్య ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పటించుకుంది. మంటల బాధకు తాళలేక లావణ్య కేకలు వేసింది. లావణ్య అరుపులు విన్న కుటుంబ సభ్యులు మంటలు ఆర్పివేసి లావణ్యను బ్రతికించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే లావణ్య చనిపోయింది. లావణ్య చనిపోయిన విషయం తెలుసుకున్న ఎల్లేశ్ తన పొలంలో ఉన్న చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అటు లావణ్య, ఇటు ఎల్లేశ్ ఇద్దరూ మృతి చెందడంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.