
వారిద్దరూ ఒకరినొకరు ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించుకున్నారు. తమ పెళ్లి విషయం పెద్దలకు తెలిస్తే.. అంగీకరించరని తెలిసి.. బలవన్మరణానికి పాల్పడ్డారు. కాగా.. కొన ఊపిరితో ఉన్న వారిని గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కాగా.. ప్రస్తుతం వారి ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదు. అయితే.. తమ కుమార్తె ఆత్మహత్యాయత్నానికి పాల్పడటానికి కారణం ఇతనే అంటూ ప్రియుడిపై యువతి తల్లిదండ్రులు కేసు పెట్టడం గమనార్హం. ఈ సంఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ములుగు జిల్లా వెంకటాపురం మండంలోని నల్లగుంటకు చెందిన ధరంసోతు రాజేష్, భూపాలపల్లి జిల్లా మంజూర్‌నగర్‌కు చెందిన ఓ యువతి(16) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. విషయం ఇంట్లో తెలియడంతో తల్లితో పాటు బంధువులు యువతిని ప్రశ్నించినట్లు తెలిసింది. పెళ్లికి నిరాకరిస్తారనే భయంతో సదరు యువతి గురువారం రాత్రి 8 గంటల సమయంలో నల్లగుంటకు వచ్చి రాజేష్‌తో కలిసి గ్రామసమీపాన ఉన్న దేవాదుల పైపులైన్ వద్దకు చేరుకుని పురుగుల మందు తాగారు.
అపస్మారకస్థితిలో ఉన్న రాజేష్ తెల్లవారుజామున స్నేహితులకు ఫోన్ చేయగా.. వారిద్వారా విషయం తెలుసుకున్న గ్రామస్తులు సంఘటనా స్థలానికి వెళ్లి ప్రేమికులిద్దరిని ములుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం రాజేష్‌ను మల్లంపల్లిలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి, యువతిని వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లారు. ఆత్మహత్యయత్నానికి పాల్పడిన యువతి మైనర్‌గా పోలీసులు పేర్కొంటున్నారు.
తమ కూతురు గురువారం రాత్రి 7 గంటలకు కిరాణా సామగ్రి తీసుకురావడానికి వెళ్లి తిరిగిరాలేదని యువతి తల్లి శుక్రవారం ఉదయం భూపాలపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దూరపు బంధువైన ధరంసోతు రాజేష్‌పై అనుమానం ఉందని ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడిపై కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. తమ కుమార్తెను రాజేష్ బలవంతంగా తీసుకువెళ్లాడని యువతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.