కరీంనగర్ లో జనసమీకరణ, సమావేశాలు... నిషేధిత పిఎఫ్ఐ సభ్యుల అరెస్ట్

By Arun Kumar P  |  First Published Apr 15, 2020, 9:09 PM IST
కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ఓవైపు లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికి జనసమీకరణ చేసి సమావేశం నిర్వహిస్తున్న ఐదుగురు పిఎఫ్ఐ అనుమానిత సభ్యులను  కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. 

కరీంనగర్: తెలంగాణలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. రాజధాని హైదరాబాద్ తర్వాత ఈ వైరస్ ప్రభావం అధికంగా వున్న జిల్లా కరీంనగర్. ఇప్పటికే ఇక్కడ లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికి రెడ్ జోన్లను కూడా ఏర్పాటుచేసి ప్రజలెవ్వరూ ఇండ్ల నుండి బయటకు రాకుండా పోలీసులు కఠిన నిబంధనలు అమలుచేస్తున్నారు. ఇలా ఓవైపు కరోనా మహమ్మారిని జిల్లా నుండి తరిమికొట్టాలని ప్రభుత్వ యంత్రాంగమంతా ప్రయత్నిస్తున్న సమయంలో నిబంధనలను ఉళ్లంఘించి జనసమీకరణ చేస్తూ సమావేశాలు నిర్వహిస్తున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు  అరెస్ట్ చేశారు. 

లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు కరీంనగర్ పోలీసులు వెల్లడించారు. పట్టణంలోని కశ్మీర్ గడ్డ ప్రాంతంలో ఐదుగురు వ్యక్తులు ఒక కిరాణా దుకాణం వద్ద నిత్యావసర వస్తువుల పంపిణీ పేరిట 70కి పైగా జనాలను సమీకరించి చిన్నపాటి సమావేశాన్ని నిర్వహించారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిత్యావసరాల వస్తువులను పంపిణీ చేయడమే కాకుండా అనుమానిత వస్తువులను కలిగిన వీరిపై కరీంనగర్ లోని 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో బుధవారం నాడు కేసు నమోదు చేశారు.

కరీంనగర్లోని హుస్సేనిపురా ప్రాంతానికి చెందిన సయ్యద్ సహా అర్సలాన్, సయ్యద్ అబూజార్, మహమ్మద్ తర్భిజ్ అహ్మద్ ఖాన్, అహ్మద్ పురా కు చెందిన మీర్జా రహమతుల్లా బేగ్, సయ్యద్ అఖిల్ లపై పోలీసులు కేసు నమోదు చేశారు. పైన పేర్కొన్న వ్యక్తుల్లో కొందరికి నిషేధిత పీఎఫ్ఐ సంస్థతో సంబంధాలు ఉన్నట్లు అనుమానాలు తలెత్తుతున్నాయి.

పీఎఫ్ఐ పేరిట ఈ నిత్యావసరాల వస్తువులను పంపిణీ చేస్తున్నారంటూ ముద్రించబడిన డోర్ పోస్టర్లు, ఢిల్లీ లో జరిగిన అల్లర్లలోని వారికి సహాయం కోసం ముద్రించిన ఒక చందాలు స్వీకరించే బుక్కు, రెండు కార్లు, రెండు సెల్ ఫోన్లు, 49 రేషన్ కిట్లను స్వాధీనం చేసుకున్నారు.  ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న వీరిని విచారిస్తున్నట్లు ఎస్ఐ స్వరూప్ రాజ్ వెల్లడించారు.

 
click me!