ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో లిక్కర్ మాఫియా ఎక్సైజ్ పోలీసులపై దాడికి దిగింది. ఈ ఘటనలో ఎక్సైజ్ ఎస్ఐ సంజీవ్ సహా మరో ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి.
ఆదిలాబాద్:ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మద్యం స్మగర్లు బుధవారంనాడు రాత్రి ఎక్సైజ్ పోలీసులపై దాడికి దిగారు.ఈ ఘటనలో ఎక్సైజ్ ఎస్ఐ సంజీవ్ తలకుగాయం కాగా,మరో ఇద్దరు కానిస్టేబుళ్లకు స్వల్ప గాయాలయ్యాయి. ఆదిలాబాద్-మహారాష్ట్ర సరిహద్దులోని లింబూగూడలో ఈఘటన చోటుచేసుకుంది.మహారాష్ట్రకు చెందిన మద్యం స్మగర్లు ఆదిలాబాద్ జిల్లాలో మద్యం విక్రయిస్తున్నారనే సమాచారం ఆధారంగా ఎక్సైజ్ అధికారులు నిఘాను ఏర్పాటు చేశారు.రాష్ట్ర సరిహద్దులోని లింబూగూడ వద్ద ఎక్సైజ్ పోలీసులను చూసిన దేశీదార్లు(లిక్కర్ స్మగర్లు) పారిపోయారు. వారిని పట్టుకొనేందుకు ఎక్సైజ్ అధికారులు వెంటాడారు. మార్గమధ్యంలోని అడవి ప్రాంతంలో స్మగ్లర్లు ఎక్సైజ్ పోలీసులపై రాళ్లతో దాడికి దిగారు.
దీంతో ఎక్సైజ్ ఎస్ఐ సంజీవ్ కు గాయాలయ్యాయి. మరో ఇద్దరు కానిస్టేబుళ్లకు స్వల్పగాయాలయ్యాయి. గాయపడిన ఎస్ఐ సంజీవ్ ను ఆదిలాబాద్ రిమ్స్ లో చికిత్స తీసుకున్నారు.ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఎక్సైజ్ వైద్యులు చెప్పారు. స్వల్పంగా గాయపడిన ధన్ రాజ్,నానక్ సింగ్ లు రిమ్స్ లో ప్రాథమిక చికిత్సతీసుకున్నారు.గాయపడిన ఎస్ఐ, కానిస్టేబుళ్లను పోలీసులను ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ పరామర్శించారు.వారిఆరోగ్యపరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఎక్సైజ్ అధికారులు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.