కేసీఆర్ తర్వాత తెలంగాణకు కేటీఆరే సీఎం అవుతారని తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు .మునుగోడు ఉప ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని ఆమె ధీమాను వ్యక్తం చేశారు.
హైదరాబాద్:కేసీఆర్ తర్వాత తెలంగాణకు కేటీఆర్ సీఎం అవుతారని తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు.బుధవారం నాడు మంత్రి హైద్రాబాద్ లోని టీఆర్ఎస్ శాసనసభపక్ష కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.టీ ఆర్ ఎస్ లో కేసీఆర్ తర్వాత సీఎం అయ్యేది కేటీఆరేనని ఎవరిని అడిగినా చెబుతారన్నారు.. ఈ విషయాన్ని తాను చండూరు లో చెప్పినట్టుగా వివరించారు.మునుగోడు లో గెలిచిన తర్వాత దేశం లో బీజేపీ ని ఎదుర్కొనేందుకు కేసీఆర్ బయలు దేరుతారని మంత్రి ప్రకటించారు.
తెలంగాణ ప్రభుత్వం అమలు చేసే పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు కావడం లేదో చెప్పాలన్నారు..రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలు తమ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయని బీజేపీ నేతలు చెప్పగలరా అని మంత్రి అడిగారు.
హైద్రాబాద్ లో బీసీ లకు తెలంగాణ ఆత్మ గౌరవ భవనాలు నిర్మిస్తున్నట్టు ఢిల్లీ లో ఆత్మ గౌరవ భవనాలు ఎందుకు కట్టడం లేదన్నారు.అభివృద్ధి పేరు చెప్పి ఓట్లు అడిగే దమ్ము బీజేపీ కి ఉందా అని మంత్రి ప్రశ్నించారు. మునుగోడు లో ఎదో జరిగితే ఆ పేరు చెప్పి తెలంగాణ ను నాశనం చేయాలని బీజేపీ కుట్ర పన్నిందన్నారు.
తెలంగాణ సమాజం బీజేపీ తీరు ను గమనించాలని ఆయన కోరారు. భారత్ జోడో యాత్ర పేరుతో మునుగోడులో బీజేపీకి కాంగ్రెస్ పార్టీ పరోక్షంగా సహాయం చేస్తుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. బీజేపీ ని ఓడించే దమ్ము కాంగ్రెస్ కు లేదన్నారు.
మునుగోడు ఉపఎన్నికల్లో బీజేపీ నేతలు మాట్లాడుతున్న తీరును ఆయన తప్పుబట్టారు.ప్రజలకు బీజేపీ నేతలు మాయమాటలు చెబుతున్నారన్నారు.ఎన్నికల కమిషన్ తమ చేతుల్లో ఉందని బీజేపీ నేతలు కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అంబానీ, ఆదానీ ల డబ్బులతో మునుగోడులో గెలవాలని బీజేపీ కలలు కంటుందని చెప్పారు. ఎన్ని కుట్రలు చేసినా మునుగోడులో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందనే విషయాన్ని బీజేపీ నేతలు చెప్పలేకపోతున్నారన్నారు. మునుగోడు లో బీజేపీ ని ప్రజలు ఛీ కొడుతున్నా ఆ పార్టీ నేతలకు బుద్ది రావడం లేదని చెప్పారు.కారు ను పోలిన గుర్తులను ఇండిపెండెంట్లకు కేటాయించేలా బీజేపీ తొలి కుట్రకు తెర లేపిందని మంత్రి విమర్శించారు.
.దుబ్బాక, హుజూరా బాద్ లో గెలిచిన తర్వాత ఒక్కహామీని కూడా బీజేపీ నిలుపు కోలేదని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ లో మత కల్లోలాలకు బీజేపీ తెర లేపుతోందని ఆయన ఆరోపించారు.ప్రజలకు ఏం చేశామో చెప్పుకోలేక మతం పేరుతో ఓట్లు దండుకొనే ప్రయత్నం చేస్తుందని వీజేపీపై ఆయన మండిపడ్డారు.కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతున్నారన్నారు.
నల్లగొండ నుంచి ఫ్లోరోసిస్ ను కేసీఆర్ తరిమారన్నారు. సొరియాసిస్ లాంటి బీజేపీ ని కూడా సాగనంపుతారని చెప్పారు.టీ ఆర్ ఎస్ వైపు ధర్మం ఉంటే బీజేపీ వైపు అధర్మం ఉందన్నారు. మునుగోడు లో ధర్మమే గెలుస్తుందని ఆయన్నారు.
పెరిగిన ధరలను గుర్తుంచుకొని బీజేపీ కి బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని ఆయన చెప్పారు. చేతి వృత్తులను తెలంగాణ తరహాలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆదుకున్నారా అని ఆయన ప్రశ్నించారు..