మార్కెట్లోకి కొత్త బిచ్చగాళ్లు: షర్మిల, రేవంత్ రెడ్డిలపై కేటీఆర్ పరోక్ష వ్యాఖ్యలు

By narsimha lodeFirst Published Jul 8, 2021, 3:02 PM IST
Highlights

తెలంగాణలో పాదయాత్రల సీజన్ మొదలైందని తెలంగాణ మంత్రి కేటీఆర్ విపక్షాలపై ఆయన సెటైర్లు వేశారు.  బీజేపీ, షర్మిలతో పాటు పలువురు నేతలు పాదయాత్రలకు రెడీ అవుతున్నారన్నారు. తమ ప్రభుత్వం చేసిన అభివృద్దిని పాదయాత్రలో చూడాలని ఆయన కోరారు. పాల పొంగులాంటి  విజయాలతో బీజేపీ నేతలు వీర్రవీగారన్నారు. 

హైదరాబాద్: కేసీఆర్ ను ఢీకొట్టే శక్తి తెలంగాణలో లేదని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్  తేల్చి చెప్పారు. గురువారం నాడు తెలంగాణ భవన్ లో  తెలంగాణ సింగరేణి కోల్‌మైన్స్ బీఎంఎస్ నేత కెంగెర్ల మల్లయ్య తన అనుచరులతో  టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్  ప్రసంగించారు.

సింగరేణి కార్మికులు 25 నుండి 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్ధుల గెలుపు ఓటములను ప్రభావితం చేస్తారన్నారు.  సింగరేణి కార్మికులకు ఇచ్చిన ప్రతి హమీని సీఎం కేసీఆర్ నెరవేర్చారని ఆయన గుర్తు చేశారు. రాజకీయంగా కూడ సింగరేణి కార్మికులు చురుకుగా వ్యవహరించాలని ఆయన కోరారు. కెంగర్ల మల్లయ్య తిరిగి స్వంత గూటికి చేరుకోవడం సంతోషంగా ఉందని మంత్రి చెప్పారు.

ప్రతి కార్మికుడికి న్యాయం జరిగే నిర్ణయాలు తీసుకొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.సింగరేణి ఏరియాలోని ప్రజా ప్రతినిధులంతా కలిసి పనిచేయాలని ఆయన సూచించారు.  న్యాయపరమైన చిక్కులున్న చిన్న చిన్న సమస్యలు త్వరలోనే పరిష్కారమౌతాయన్నారు. 

కొంతమంది కొత్త బిచ్చగాళ్లు మార్కెట్లోకి వచ్చారన్నారు. ఏనుగులు వెళ్తుంటే కొందరు మొరుగుతుంటారని ఆయన విమర్శించారు. కేసీఆర్ నుండి అధికారం గుంజుకొంటామని కొందరు అంటున్నారన్నారన్నారు. కేసీఆర్ ను తిట్టడమే కొందరు పనిగా పెట్టుకొన్నారన్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డిని, వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపిస్తున్న వైఎస్ షర్మిలను ఉద్దేశించి కేటీఆర్ ఆ వ్యాఖ్యలు చేశారని భావిస్తున్నారు. 

కేసీఆర్‌ను గెలవాలంటే కేసీఆర్ కంటే ఎక్కువగా తెలంగాణను ప్రేమించాలని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. కేసీఆర్ ను తిడితే గొప్ప నాయకులు అయిపోతారనే భ్రమను వీడాలని ఆయన విపక్షాలకు హితవు పలికారు. రాష్ట్రంలో  చాలామంది నేతలు పాదయాత్రలు చేసేందుకు సిద్దమౌతున్నారన్నారు. కరోనా తర్వాత పాదయాత్రలు చేస్తే  ఆరోగ్యం  మరింత  మెరుగుపడుతుందని ఆయన సెటైర్లు వేశారు. 

 పాదయాత్రలతో ప్రజల దగ్గరకు వెళ్తే అక్కడ అభివృద్దిని చూడాలని ఆయన హితవు పలికారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత  బీజేపీ నేతలు ఎగెరిగిపడ్డారన్నారు.  ఆ తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. నాగార్జునసాగర్ లో జానారెడ్డిని ఓ యువకుడు ఓడించాడని ఆయన గుర్తు చేశారు. 

click me!